హైదరాబాద్ జూలై 14 (నమస్తే తెలంగాణ): 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నిర్లక్ష్యం చూపుతున్నాయని సమాజ్వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి విమర్శించారు. సోమవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ బీసీలకు 42 శాతం కోటా అమలులో కాంగ్రెస్ సర్కారు తప్పిదాలను ఎత్తిచూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలహీనవర్గాలను మోసం చేస్తున్న తీరును నిర్మోహమాటంగా ఎండగట్టారు. పాలకులు బీసీలను బలిపశువులను చేస్తున్నారని కుండబద్దలు కొట్టారు. ‘రాజ్యాంగంలో రిజర్వేషన్ల పరిమితిపై ఎలాంటి సీలింగ్ లేదని, కానీ, సుప్రీంకోర్టు మాత్రం 50 శాతం దాటొద్దని నిర్దేశించిందని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో తెలంగాణలో బీసీలకు 42 శాతం కోటా దక్కాలంటే పార్లమెంట్లో తీర్మానం చేసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆర్డినెన్స్ ద్వారా స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు వర్తింపజేయడం సాధ్యంకాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జనాభాలో సుమారు 60 శాతం ఉన్న బలహీనవర్గాలను కాంగ్రెస్, బీజేపీలు రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ సర్కారు అసెంబ్లీలో బీసీ బిల్లులను ఆమోదించి రాష్ట్రపతికి పంపి చేతులు దులుపుకున్నదని మండిపడ్డారు. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.
అయిష్టంగానే కాంగ్రెస్ అడుగులు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి విముఖతను ప్రదర్శిస్తూ వచ్చిందని ప్రొఫెసర్ సింహాద్రి విమర్శించారు. అటు అధిష్ఠానం, ఇటు పౌరసమాజం ఒత్తిడికి దిగొచ్చి అయిష్టంగానే అడుగులు వేసిందని చెప్పారు. ఈ దిశగా కొంత ప్రయత్నం చేసి నా చిత్తశుద్ధి లోపించిందని తెలిపారు. బీసీ బిల్లు ఆమోదానికి అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి వచ్చినప్పటికీ ఐక్యకార్యాచరణ దిశగా నడిపించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నాయకత్వం తీవ్ర నిర్ల క్ష్యం ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. బీసీ బిల్లు ఆమోదం కోసం ప్రధానమంత్రికి ఒక్కసారి కూడా విజ్ఞప్తి చేయకపోవడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని ఆక్షేపించా రు. ఇప్పటికైనా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభు త్వం రాజకీయ లబ్ధిని పక్కనబెట్టి మేధావులు, ప్రజాసంఘాలు, పార్టీలను కలుపుకొని ఐక్యకార్యాచరణ చేపట్టాలని సూచించారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
బీసీల ఆగ్రహం తప్పదు
42శాతం బీసీ రిజర్వేషన్ల సాధనలో కాంగ్రెస్, బీజేపీ విఫలమైతే బీసీ వర్గాల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్ సింహాద్రి హెచ్చరించారు. ఈ విషయంపైనే ఊరూరా చర్చ జ రుగుతున్నదని, ఈ విషయంలో ప్రభు త్వం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉన్నదని చెప్పారు. బీసీలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే ప్రజాస్వా మ్యం బలపడుతుందని విశ్లేషించారు.