తాండూరు, సెప్టెంబర్ 28 : ‘రాష్ర్టాభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో సర్కార్‌పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు ఓట్లెయ్యరనే కాంగ్రస్ సర్కార్ నాటకం ఆడుతున్నది’ అని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి.. మరోవైపు అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు రిజర్వేషన్లు పెంచుతున్నట్టు నటిస్తూ, తన అనుచరులతో అదే రిజర్వేషన్లు అమలుకాకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ప్రస్తుతం 42 బీసీ రిజర్వేషన్ల అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడైన రెడ్డి జాగృతి ప్రతినిధి మాధవరెడ్డి పిటిషన్ వేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కతో మాధవరెడ్డి దిగిన ఫొటోలను మీడియా ఎదుట ఆయన ప్రదర్శించారు. బీసీలను మోసం చేయాలనే కుట్ర పన్నుతున్న రేవంత్‌రెడ్డికి, సహకరిస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. భాను, నరేశ్, శ్రీధర్, మనోహర్, సిద్ధిఖీ తదితరులు పాల్గొన్నారు.