ఖైరతాబాద్, నవంబర్ 17: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కపటనాటకాలడుతున్నాయని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డీ రాజారాం యాదవ్ విమర్శించారు. ఆ పార్టీల వైఖరిని నిరసిస్తూ ఈనెల 24న ఆయా రాష్ట్ర కార్యాలయాల ఎదుట గాంధీగిరి పేరుతో శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 42శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై, రాజ్యాంగ సవరణ చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని స్పష్టంచేశారు. బీసీల రిజరేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే మోసం చేస్తూ వస్తుందని, కేంద్రానికి మాత్రం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశమే లేదని మండిపడ్డారు.
నిత్యం హిందువుల గురించి మాట్లాడే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలు హిందువుల్లా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లను ఇచ్చిన తర్వాతే స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్టీపరంగా ఇస్తామంటే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. ఈనెల 24న జరిగే గాంధీగిరి కార్యక్రమాన్ని బీసీలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్, బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకోటి ముదిరాజ్, బీసీ యుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంతుల రామ్మూర్తి గౌడ్, బీసీ జనసభ ఉపాధ్యక్షుడు బూర వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.