బీజేపీ.. కేంద్రంలో అధికార పార్టీ! హైదరాబాద్ మహానగరంలో ముగ్గురు ఎంపీలు సహా తెలంగాణలో దాదాపు సగం పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ!
అట్లాంటి పార్టీ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఎందుకు కాడి పడేసింది?
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికతో ‘మాకు సంబంధం లేదు’ అన్నట్టుగా బీజేపీ ఎందుకు వ్యవహరించింది?
ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ మీద తెలంగాణలో ఎందుకు పోరాడకుండా వదిలేసింది? పైగా ఉనికిని వదిలేసుకుని మరీ ఊతకర్రగా ఎందుకు మారింది?
ఆగర్భ శత్రువుగా అభివర్ణించే మజ్లిస్‌తో భుజం కలిపిన అధికారకాంగ్రెస్కు ఎదురునిలవకుండా.. ఎందుకు తాను మరో భుజంగా మారిపోయింది?
ఈ ప్రశ్నలన్నింటికీ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమాధానం చెప్పేసింది. కాంగ్రెస్‌కు జీవగంజి పోసేందుకు.. కమలం బలవన్మరణానికి సిద్ధమవుతుండటమే రాజకీయ వైచిత్రి!
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో (Telangana) మునుపు హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఇలా ఏ ఉప ఎన్నిక జరిగినా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నదంటూ కమలనాథులు (BJP) పదుల సంఖ్యలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కోట్లాది రూపాయలు పంపిణీ చేస్తున్నారంటూ నిత్యం తమ అనుకూల మీడియాలో గగ్గోలు పెట్టారు. ప్రచార సమయంలో రాష్ట్ర నేతలతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి బీజేపీ నేతలు వచ్చి నానా హంగామా సృష్టించారు. అలాంటిది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారపర్వం వరకూ బీజేపీ నేతల హడావుడి ఏమాత్రం కనిపించలేదు. పైగా అధికార కాంగ్రెస్ (Congress) విచ్చలవిడిగా వందల కోట్లు డబ్బులు, చీరలు, కుక్కర్లు పంపిణీ చేసినా ఏ ఒక్క బీజేపీ ఎంపీ కూడా నోరు విప్పలేదు. చివరకు బీజేవైఎం నేతల మీద కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు దాడులకు పాల్పడినా, పోలింగ్ బూత్‌లలో దొంగ ఓట్లతో హోరెత్తించినా ఒక్క బీజేపీ రాష్ట్ర నాయకుడు అడ్డుకునే ప్రయత్నం మాట దేవుడెరుగు, క్షేత్రస్థాయిలో కూడా కనిపించలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ కాబట్టి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే వెంటనే ఆ ప్రభావం కనిపిస్తుందనేది అందరికీ తెలిసిన సత్యం. అయినా బీజేపీ నుంచి ఒక్క ఫిర్యాదు కూడా పోలేదు.
దీనిని బట్టి బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ మాటల్లో చెప్పాలంటే ‘కిషన్రెడ్డీ.. ఏ పార్టీని గెలిపిస్తున్నవ్?’ అనే ప్రశ్నకు సమాధానం దొరికినట్లే కదా!! ఈ దోబూచులాటలో నేతల వ్యక్తిగత ఎజెండాలు నెరవేరవచ్చుగానీ సైద్ధాంతిక విబేధాలున్న కాంగ్రెస్ ‘చేతి’లో ఏమిటీ కమల విలాపం? అని రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో ఓ కీలక అంకాన్ని బట్టబయలు చేసిందని మొదటి నుంచి సునిశితంగా గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ అనగానే రాజకీయ పార్టీల వ్యూహాలు, ప్రచార హోరు, పోలింగ్ జిమ్మిక్కులకు ఈ ఉప ఎన్నిక మొదటిది కాదు, చివరిదీ కాదు. కానీ ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికలో ఎలా వ్యవహరించాయి, ఎటువైపు అడుగులు వేశాయనే అంశాలను మాత్రం ప్రజలు కచ్చితంగా గమనిస్తుంటారు. అందులో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జాతీయ పార్టీ బీజేపీ తీరే ఇప్పుడు రాజకీయవర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. ఉప ఎన్నిక తెరపైకి వచ్చింది మొదలు అసలు తమకు సంబంధం లేదన్నట్టుగానే బీజేపీ రాష్ట్ర పార్టీ వ్యవహరించడంతో ఈ అనుమానాలు మొదలయ్యాయి. కనీసం పార్టీ అభ్యర్థిని ప్రకటించడంలోనూ రాష్ట్ర పార్టీ అధిష్ఠానం సరిగా స్పందించలేదు. ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దిగినప్పటికీ బీజేపీ కిమ్మనకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో సెటైర్లు వేస్తే తప్ప హడావుడిగా అభ్యర్థి ప్రకటన జరగలేదు. గతంలో ఏనాడూ బీజేపీ నుంచి ఇలాంటి నిర్లిప్తత కనిపించలేదని, ఇది ఉద్దేశపూర్వకం అనేందుకే బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో సాంకేతికంగా బీజేపీ ప్రజాప్రతినిధులకు కొదవలేదు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు (రాజాసింగ్‌ను బహిష్కరించారు), ఎనిమిది మంది ఎంపీలతోపాటు నగరానికి చెందిన మరో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఉన్నారు. జాతీయ స్థాయిలో బద్ధ శత్రువైన కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పాటు రెండేండ్ల పాలనలో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో గెలుపు కీలకం కాకున్నా ఉప ఎన్నిక వేదికగా అధికార పార్టీని ఎండగట్టి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మెరుగైన అవకాశాలుంటాయనేది జాతీయ పార్టీ అయిన బీజేపీకి తెలియంది కాదు. కానీ కనీసం ఆ వైపుగా ప్రయత్నం చేయలేదన్నది సుస్పష్టం. ప్రచారం కోసం 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆ పార్టీ విడుదల చేయగా, ఇందులో పేర్లున్న 12 మంది జాతీయ నాయకులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. పైగా రాష్ట్ర నేతలు కనీసం ఆ ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు.
ఇక కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నామమాత్రంగా ప్రచారంలో పాల్గొనగా, ఆయన వెంట ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే కనిపించారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కంటి తుడుపు చర్యగా ప్రచారం చేశామనిపించారు. ఎంపీలు అర్వింద్, సోయం బాపురావు, నగేశ్ కనీసం జూబ్లీహిల్స్ వైపు కూడా రాలేదు. ఒక్క శాతం మినహా మిగిలిన నేతలంతా మెరుపులా మెరిసి వెళ్లారే తప్ప నియోజకవర్గాన్ని పట్టుకొని ప్రచారపర్వాన్ని కొనసాగించిన ఒక్క నేత లేరంటే అతిశయోక్తి కాదు. చివరకు ‘ఈ ఉప ఎన్నికలో బీజేపీ ఎక్కడుంది? డిపాజిట్ సైతం రాదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి వెటకారం చేసినా బదులుగా బీజేపీ నేతలు స్పందించలేదు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నేతల ప్రచార తీరు, స్పందనపై కిందిస్థాయి క్యాడర్ తీవ్ర నిరాశకు గురై బీఆర్ఎస్లో చేరిన వారు అనేకమంది ఉన్నారు.

ఒకవైపు ఉత్కంఠతో సాగుతున్న బీహార్ ఎన్నికల్లో బీజేపీ అధిష్ఠానం కాంగ్రెస్‌తో యుద్ధం చేస్తున్నది. కానీ అదే సమయంలో జూబ్లీహిల్స్‌లో అధికార కాంగ్రెస్ మీద ఈగ వాలకుండా తెలంగాణ బీజేపీ సర్వ శక్తులూ ఒడ్డిందనే విమర్శలున్నాయి. ముఖ్యంగా మతం కోణంలో ఆగర్భ శత్రువు అంటూ నిత్యం అభివర్ణించే మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్నామని ప్రకటించి, క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు జోడీ కట్టి ప్రచారం చేస్తుంటే ఆ జోడీతో బీజేపీ చెట్టాపట్టాలేసుకున్నదని ఆరోపణలున్నాయి. ఇందుకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రచారాన్నే ఉదాహరణగా చూపుతున్నారు. ప్రచారంలో అధికార పార్టీ వైఫల్యాలు, అవినీతిని ఎండగట్టాల్సిన ఆయన అందుకు భిన్నంగా బీఆర్ఎస్ను మాత్రమే లక్ష్యంగా ఎంచుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మహిళ అని మరిచి ఆమె కుటుంబ, వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేశారు. అందుకు ప్రతిగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి బండి వ్యాఖ్యల్ని ప్రస్తావించారంటే రెండు పార్టీల మధ్య ఏమిటీ అవగాహన? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇక, హైడ్రా బాధితుల పక్షాన బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలో గళం విప్పింది. దీనికి కాంగ్రెస్ పార్టీ బదులియ్యాలి. కానీ అందుకు భిన్నంగా బాధితుల పక్షాన నిలబడాల్సిన బీజేపీ అది చేయకపోగా, గతంలో ఒక ఎంపీ హైడ్రాకు అనుకూలంగా మాట్లాడితే, ఈ ఉప ఎన్నిక ప్రచారంలో బండి సంజయ్ బాధితుల కన్నీటిని డ్రామాగా అభివర్ణించారు. అందుకు కొన్నిరోజుల ముందే కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపీనాథ్ కన్నీళ్లను అపహాస్యం చేశారు. అంటే రెండు పార్టీలు మహిళ, బాధితుల కన్నీళ్లను ఒకేరీతిన కృత్రిమ ఏడుపులుగా ఎద్దేవా చేయడం కూడా రెండుపక్షాల మధ్య బంధాన్ని ఎత్తి చూపేలా ఉన్నదని అంటున్నారు. ఉప ఎన్నిక ముందు జూబ్లీహిల్స్‌ను ఆనుకొని ఉన్న బంజారాహిల్స్‌లో పెద్దమ్మ గుడి స్థల వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మొదలు ఎంపీలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తీరా ఉప ఎన్నికలో మాత్రం ఎక్కడా ఆ ఊసే ఎత్తకుండా జాగ్రత్త పడటం వెనక ఆంతర్యమేంటని సగటు బీజేపీ కార్యకర్త ప్రశ్నిస్తున్నాడు.
సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా ఇతర పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడటం, దొంగ ఓట్లకు యత్నించడం వంటి పరిణామాలపై బీజేపీ గోరంతను కొండంతలు చేస్తుందనేది బహిరంగ రహస్యం. అదో రాజకీయ వ్యూహంగా కూడా ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్తారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చివరకు స్వతంత్ర అభ్యర్థులైనా అధికార కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందంటూ నోరెత్తారేగానీ ఒక్క బీజేపీ నేత కూడా పెదవి విప్పలేదు. ప్రచారం చివరి రోజు కంటే ముందుగానే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగా నోట్ల కట్టల్ని తరలిస్తున్న వీడియోలు బయటికొచ్చాయి. బస్తీల్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున డబ్బుల్ని పంపిణీ చేసిందనేది బహిరంగ రహస్యం. పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ కేంద్రానికి సమీపంలో కూడా చివరి నిమిషం వరకు చీరలు, డబ్బుల్ని పంచింది. దీనికి ఆధారంగా అనేక వీడియోలు బయటికొచ్చాయి. షేక్‌పేటలో మజ్లిస్ పదుల సంఖ్యల్లో పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకొని భారీ ఎత్తున రిగ్గింగ్ చేసినట్టు కొన్ని ఆధారాలు కూడా బయటికొచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తరలించి ఫంక్షన్ హాళ్లలో ఉంచి మరీ దొంగ ఓట్లు వేయించినట్టు ఆధారాలు బయటికొచ్చాయి. కానీ వీటిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చివరకు పార్టీ అభ్యర్థి కూడా ఒ క్క ఆరోపణ కూడా చేయలేదు. ఎన్నికల కమిషన్‌కు ఒక్క ఫిర్యాదు చేయకపోవడమంటే అధికార కాంగ్రెస్‌కు సహకరించమే కదా! పోలింగ్ ముగిసిన మరుసటి రోజైనా మాట వరసకు కాంగ్రెస్ అధికార దుర్వినియోగాన్ని ఎత్తి చూపకపోవడమంటే కాంగ్రెస్-మజ్లిస్ ద్వయం పోలింగ్ రోజు చేసిన పనులను బీజేపీ సమర్థించినట్లే కదా?! అని పలువురు ప్రశ్నిస్తున్నారు.