హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తేతెలంగాణ): డీసీసీ నియామకాలపై కాంగ్రెస్ పార్టీ మాటతప్పింది. డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో ప్రజాప్రతినిధుల కుటుంబాలకు, వారి బంధువులకు, ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవారికీ అవకాశాలు ఉండబోవని కాంగ్రెస్ తొలుత ప్రకటించింది. కానీ, తాజాగా ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియా చిట్‌చాట్‌లో డీసీసీ నియామకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నదని స్వయంగా ప్రకటించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి, కోదాడ ఎమ్మెల్యే అయిన పద్మావతీరెడ్డి సూర్యాపేట డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేశారని, ఇంకొన్నిచోట్ల ఎమ్మెల్యేలు డీసీసీ బాధ్యతలు తీసుకోవడం మంచిదని భావిస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు డబుల్ పోస్టులుగా చూడబోవని స్పష్టంచేశారు.అప్పటికే పార్టీలో ఉండి సేవలందిస్తున్న కుటుంబాలకు ఈ విషయంలో ఎలాంటి అడ్డంకి ఉండబోదని చెప్పారు. పార్టీయే అన్నింటికంటే సుప్రీం అని, పార్టీ నియమావళికి లోబడే నడుచుకోవాలని మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిస్థితులన్నింటినీ కాంగ్రెస్ అధిష్టానం గమనిస్తున్నదని తెలిపారు.
ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే మాకు గౌరవం ఉన్నదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అడ్డంకిగా మారారని ఆరోపించారు. కిషన్‌రెడ్డి లీడ్ చేస్తే ప్రధాని వద్దకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. కేంద్రం నుంచి ప్రాజెక్టులు తేవడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్రం ఒకరూపాయి కూడా ఇవ్వడం లేదని తెలిపారు. 2017 నుంచి ఒకటే కంపెనీ వద్ద హోలోగ్రామ్ కాంట్రాక్టు ఉన్నదని, టెండర్‌కు ఎందుకు పోలేదో ఐఏఎస్ అధికారి రిజ్వీ సమాధానం చెప్పాలని కోరారు.