మణుగూరు టౌన్, డిసెంబర్ 7 : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ ప్రచారవాహనంతోపాటు డ్రైవర్పైనా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా గుండి గౌరి తరఫున ఓ ప్రచార వాహనం (ఆటో) మైకు ద్వారా ఆదివారం గ్రామంలో ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వాహనంపై దాడికి దిగారు. ‘ఈ వీధిలో తిరుగుతూ ఎందుకు ప్రచారం చేస్తార్రా?’ అంటూ వాహన డ్రైవర్ నజీర్ పాషాపైనా దుర్భాషలాడారు. ఈ క్రమంలో అతడిపై చేయిచేసుకున్నారు. అతడు ఫోన్ చేసి చెప్పడంతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పార్టీ శ్రేణులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడి చేశారంటూ డ్రైవర్, తమ ప్రచార వాహనంపై దాడి చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు.. మణుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గంట గడిచినా పోలీసులు కదలలేదు. నిందితులపై చర్యలకు ఉపక్రమించలేదు. ఆగ్రహం వ్యక్తంచేసిన రేగా కాంతారావు.. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మణుగూరు పోలీసుస్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ప్రచార వాహనంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భౌతికదాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు గూండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బెదిరింపులు, దాడులతో బీఆర్ఎస్ను అడ్డుకోవడం అసాధ్యమని హెచ్చరించారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గుండి గౌరి, బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, కుంటా లక్ష్మణ్, పోశం నర్సింహారావు, అడపా అప్పారావు, వట్టం రాంబాబు, యాదగిరి గౌడ్, రంజిత్, రవి, సృజన్ తదితరులు పాల్గొన్నారు.