Congress | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): బీసీ కులగణన చేపడతాం. రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతాం. అంటూ అసెం బ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హడావుడి చేసింది. సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసింది. రూ.150 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వు లు సైతం జారీచేసింది. అదంతా ఉత్తముచ్చటేనని తేలిపోయింది. ఓటర్ల జాబితా ఆధారంగానే బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సిద్ధమైంది. చిట్‌చాట్ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని స్పష్టంగా తెలియజేశారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఉత్త ముచ్చటేనని తేటతెల్లమైంది.
జనగణన 1948 చట్టం ప్రకారం జనాభా లెక్కల సేకరణ, కులగణన చేపట్టే అధికారం కేవలం కేంద్రానికి మాత్రమే ఉన్నది. రాష్ట్ర ప్ర భుత్వాలు చేపట్టే కులగణనకు చట్టబద్ధత లేకపోగా.. వాటిని అమలు చేసే అవకాశం కూడా లేదు. ఇటీవల బీహార్ రాష్ట్ర సర్కారు నిర్వహించిన కులగణన కోర్టుకెక్కింది. బీహార్ ప్రభు త్వం కులగణన నిర్వహించి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీసింది. వాటి ఆధారంగా రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది. ఈడబ్ల్యూఎస్ కోటా కలుపుకుంటే రిజర్వేషన్లు 75 శాతానికి పెరిగాయి. సుప్రీంకోర్టు గతంలో విధించిన 50 శాతం కోటా పరిమితిని మించిపోతున్నదని, బీహార్ ప్రభుత్వానికి కులగణన చేపట్టే అధికారాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చే స్తూ పలువురు కోర్టుకెక్కారు. దీంతో రిజర్వేషన్ల అమలు మళ్లీ మొదటికి వచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా బీసీ కులగణన చేపడతామని, రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల అనంతరం పదేపదే ఈ అంశా న్ని పునరుద్ఘాటించారు. చట్టబద్ధత కల్పిస్తామ ని చెప్పి చివరకు అసెంబ్లీలో తీర్మానం చేయడంతోనే కాంగ్రెస్ తన మోసపూరిత వైఖరిని బయటపెట్టుకుంది. ఆ తరువాత కులగణనకు రూ.150 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కులగణన నిర్వహణపై బీసీ కమిషన్‌కు ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయలేదు. ఇప్పుడు ఏకంగా ఓటరు జాబితా ఆధారంగానే రిజర్వేషన్ల స్థిరీకరణ చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం గమనార్హం.
చాలా రాష్ర్టాలు ఓటరు జాబితా ఆధారంగానే రిజర్వేషన్లను స్థిరీకరించాయి. ఇప్పుడు అదే బాటలో నడించేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం మొగ్గు చూపుతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన తాజా ఓటరు జాబితాను అనుసరించి, గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం యూనిట్‌గా తీసుకుని బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఇందులో ఆయా యూనిట్ల వారీగా రాజకీయాల్లో ఆయా బీసీ వర్గాల ప్రాతినిధ్యం ఆధారంగా రిజర్వేషన్లను స్థిరీకరించనున్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఓటరు జాబితా ఆధారంగా బీసీల రిజర్వేషన్లను స్థిరీకరించాయి. బీహార్, కర్ణాటక సమగ్ర కులసర్వేలను నిర్వహించాయి. వాటి ఆధారంగా బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను రద్దు చేసి, వాటన్నింటినీ జనరల్ స్థానాలుగా మార్చింది. అయితే బీసీలకు పార్టీ పరంగా 50 శాతం టిక్కెట్లను కేటాయించింది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ సైతం అదే ఎత్తుగడను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. బీసీ కమిషన్‌ను నియమించి, రిజర్వేషన్లను 23 శాతంగా స్థిరీకరించాలని, మిగిలిన 19 శాతం రిజర్వేషన్‌ను పార్టీ పరంగా టిక్కెట్లు కేటాయించి, తద్వారా 42 శాతం హామీని నిలబెట్టుకోవాలనే చూస్తున్నట్టు తెలుస్తున్నది. దీనిపై రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం కొనసాగుతున్నది. తాజాగా ఓటరు జాబితా ద్వారా రిజర్వేషన్ల స్థిరీకరణ అని సీఎం ప్రకటించడంతో అదే విషయం తేటతెల్లమవుతున్నది.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని అమలు చేయాలని రాష్ట్రంలోని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమగ్ర కులగణన నిర్వహించి, బీసీలకు ఉపకులాల వారీగా రిజర్వేషన్లు కల్పించిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని అల్టిమేటం జారీ చేస్తున్నాయి. గతంలో మాదిరిగానే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం పూనుకుంటే తీవ్రస్థాయిలో పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాయి.
రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ రెండున రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను దొమలగూడలోని బీసీ భవన్లో గురువారం ఆవిషరించారు సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత ఒకమాట చెప్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోవిధంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలకతంగా సమస్త బీసీ సమాజం ప్రత్యక్షంగా పాల్గొని కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి తర్వాత లక్ష మందితో హైదరాబాదును దిగ్బంధిస్తామని హెచ్చరించారు.