నారాయణపేట, ఫిబ్రవరి 13 : నారాయణపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థిని ముందే ప్రకటించింది. 16వ వార్డు నుంచి పోటీ చేసిన సరిత బట్టడ్ను చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించడంతో అప్పటి వరకు చైర్పర్సన్ సీటు ఆశించిన సీనియర్ నాయకులు డీలా పడిపోయారు. ఇక్కడ బీజేపీ బలంగా ఉండటమే కాకుండా ఆ వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థి సామాజికవర్గం ఓటర్లు అత్యధికంగా ఉండటం, పైగా కలిసికట్టుగా పనిచేయడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయింది.
పట్టణంలోని 17, 20వ వార్డుల నుంచి అత్తాకోడళ్లు గెలుపొందారు. ఒకరు బీజేపీ నుంచి గెలుపొందగా, మరొకరు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 17వ వార్డు నుంచి బీజేపీ తరపున గెలుపొందిన కల్పనా రాఘవేందర్గౌడ్కు కోడలు వరసయ్యే శ్వేతా వెంకటేశ్‌గౌడ్ 20వ వార్డు నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందింది. ఇదే వార్డు నుంచి మరో ముగ్గురు వివిధ వార్డుల్లో, వివిధ పార్టీల నుంచి పోటీ చేసి కౌన్సిలర్లుగా గెలుపొందారు. 6, 17వ వార్డుల నుంచి మంజుల రాఘవేందర్‌రెడ్డి, కల్పన రఘురామయ్యగౌడ్ బీజేపీ నుంచి గెలుపొందారు. 18వ వార్డు నుంచి గొల్ల రవితేజ కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇలా ఒకే వార్డుకు చెందిన నలుగురు గెలుపొందడం విశేషం.