Siddipet | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేసీఆర్ అభివృద్ధి పాలనను కోరుకుంటూ సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కుకునూరుపల్లి, గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాలకు చెందిన కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల కీలక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు గజ్వేల్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీశ్ రావు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. అవ్వ తాతలకు నెలకు 4 వేల పెన్షన్ ఇస్తామని బాండ్లు రాసిచ్చి, అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపారని విమర్శించారు. రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. యాసంగి రైతుబంధు పడలేదని, 2 లక్షల రుణమాఫీ సగం మందికి కూడా పూర్తి కాలేదని.. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతుందని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆర్భాటంగా ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారని హరీశ్‌రావు గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయిందని.. ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా? అని ప్రశ్నించారు. కొత్తవి దేవుడెరుగు, ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా నెలల తరబడి పెండింగ్ లో పెట్టి పేదల పెళ్లిళ్లకు సాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.

గతంలో సర్పంచ్‌లు చేసిన పనులకు బిల్లులు ఆపివేసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. బిల్లులు ఇవ్వాలని అడిగిన పాపానికి సర్పంచ్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం జైలు పాలు చేసిందని పేర్కొన్నారు. సర్పంచ్ల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా, ప్రత్యేక అధికారుల పాలన తెచ్చి గ్రామాలను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఖర్చులు భరించలేక పంచాయతీ కార్యదర్శులు లీవులు పెట్టి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కనీసం స్ట్రీట్ లైట్స్ నిర్వహణ లేక గ్రామాలు చీకటిమయం అయిపోయాయన్నారు. పారిశుధ్యం పడకేసి విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదన్నారు.
పారిశుధ్య లోపం వల్లే గజ్వేల్ ప్రాంతంలో చాలామంది డెంగ్యూ వంటి విషజ్వరాలతో చనిపోయారని హరీశ్‌రావు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఒకప్పుడు కరువు, వలసలకు నిలయమైన గజ్వేల్‌ను.. దేశానికి ఆదర్శంగా, రోల్ మోడల్ గా తీర్చిదిద్దింది కేసీఆర్ అని అన్నారు. ఆ అభివృద్ధిని కాపాడుకోవాలన్నా, భవిష్యత్తులో గ్రామాలు బాగుపడాలన్నా అది మళ్ళీ కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వస్తున్నారని తెలిపారు. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన వారిని నిలదీయాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని.. చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయని, అందరి కష్టాలు తీరుతాయని ధీమా వ్యక్తం చేశారు.