హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ రెండూ దొంగాట అడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆరోపించారు. బీసీలకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ఆ పార్టీ నాయకులే అంటున్నారని చెప్పారు. బీసీలకు న్యాయం చేసింది కేసీఆరేనని స్పష్టం చేశారు. బీసీ కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి తప్పు అని బీసీ మేధావులు, విద్యార్థులు, బీసీ సంఘాలు ఆధారాలతో సహా చూపించాయని చెప్పారు. కులగణన విషయంలో అందరితో కలిసి బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నదని తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రీసర్వే చేస్తున్నదని, ఇది అందరి విజయమని అన్నారు. బీసీ కులగణన, 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీసీ కులగణన, తాజా పరిణామాలపై ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ముఠా గోపాల్: కాంగ్రెస్ పార్టీ తాను చేయని పనిని చేశామని చెప్పుకోవటానికి పోటీపడుతున్నది. 2014లో కేసీఆర్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. దాని ఫలితంగానే బీసీల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేశారు. దీన్నెవరూ కాదనలేరు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవటానికి కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది. దాన్ని నిజం చేస్తున్నామని చెప్పుకునేందుకు చేపట్టిన కులగణన తప్పుల తడకగా ఉన్నదని తేలిపోయింది. రీ సర్వే చేస్తున్నదంటేనే కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని ఒప్పుకున్నట్టు. బీసీల జనాభాను తగ్గించి చూపింది. బీసీలకు అన్యాయం చేయాలని కుట్రలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు, మేధావులు, విద్యార్థులు, పార్టీగా మేమూ (బీఆర్ఎస్) పోరాటాలు చేస్తామని కార్యాచరణ ప్రకటించేసరికి మళ్లీ రీ సర్వే చేస్తున్నది. దీన్ని గొప్పగా చెప్పుకోవటం అన్యాయం.
బీసీలకు న్యాయమైన వాటా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ప్రభుత్వ చర్యలు చెప్తున్నాయి. కులగణన శాస్త్రీయంగా జరగలేదని బీసీ సంఘాలు ఆధారాలతో సహా చెప్తున్నాయి. బీసీల జనాభాను తగ్గించి చూపటంలోనే కాంగ్రెస్ మోసం దాగి ఉన్నది. సర్వే చేస్తే కులాల వారీగా జనాభా ప్రకటించాలి. అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిన లెక్కలు తప్పని తేలిపోయింది. కొన్ని కులాల జనాభా పెరిగి, బీసీల జనాభా తగ్గటంలో మతలబు ఏమిటీ? బీసీ జనాభా తగ్గింది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ నుంచి తప్పించుకోవటానికి కాంగ్రెస్ పార్టీ దారులు వెతుక్కుంటున్నదని అనుమానాలు కలుగుతున్నాయి. ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా జరగాలన్నదే మా డిమాండ్. నిజానికి మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే శాస్త్రీయంగా జరిగింది. కానీ టెక్నికల్ అంశాలను సాకుగా చూపి అసలా సర్వేనే తప్పన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది. అంత ఖర్చుపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే సరైనదే అయితే మళ్లీ రీ సర్వే ఎందుకు? రీ సర్వే చేస్తున్నదంటేనే పరోక్షంగా ప్రభుత్వం తప్పు చేసిందని ఒప్పుకున్నట్టే కదా!
బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అంతకన్నా కావలసింది ఏముంటుంది. దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి కనిపించటం లేదు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామనే మాటను కాంగ్రెస్ పార్టీ నిలుపుకోవాలంటే అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. తమిళనాడు తరహాలో బీసీలకు రిజర్వేషన్లు సాధించాలని కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేశారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దేశ చరిత్రలో కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని నాటి ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసి వినతిపత్రం ఇప్పించారు. ఆర్.కృష్ణయ్య సహా అనేక మంది బీసీ నాయకులను కేసీఆర్ మన్మోహన్సింగ్ దగ్గరికి తీసుకెళ్లారు. కానీ, ఏం జరిగింది? పదేండ్లుగా కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేశారు. కేంద్రం పట్టించుకోలేదు. సరే, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నది. దాన్ని స్వాగతిస్తున్నాం. అది వాస్తవరూపం దాల్చాలని మేం ఆశిస్తున్నాం. కులగణన రిపోర్ట్‌ను అసెంబ్లీలో స్టేట్మెంట్ రూపంలో చదివినప్పుడే కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమైపోయింది. స్థానిక సంస్థల్లో బీసీ ఓట్లను పొందేందుకే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ముందుకు తెచ్చిందని మేం భావిస్తున్నాం.
ముఠా గోపాల్ : కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు దొంగాట ఆడుతున్నాయి. ఆ రెండు పార్టీలు బీసీలకు శాశ్వత న్యాయం చేయాలనుకుంటే ఆ రెండు పార్టీలకు చెందిన 16 మంది ఎంపీలు పార్లమెంట్లో పట్టుబట్టాలి. అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ సీఎం అని చెప్పింది. ఎన్నికలు అయ్యాక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అయ్యారో అందరికీ తెలుసు. అలాగే, కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులకు జరుగుతున్న మోసం ఎట్లా ఉందో ఆ పార్టీ మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు అందరూ చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీగా మేమూ కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేసేలా ఒత్తిడి తెస్తాం. అందుకోసం అందరిని కలుపుకోని పోరాటాలు చేస్తాం. పార్లమెంట్లో చట్టం చేసేదాకా ఒత్తిడి పెంచుతాం.
అదో పెద్ద కుట్ర. మొదటి నుంచి బీసీలను ముంచిందే కాంగ్రెస్. దానిది బీసీలను తొక్కిపెట్టిన చరిత్ర. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. బీసీలకు మండల్ కమిషన్‌ను ప్రకటించిన జనతాపార్టీ దాన్ని అమలు జరపటానికి జనతాదళ్ కృషి చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ నుంచి కాంగ్రెస్ తప్పుకుంటున్నది. అందుకే 42శాతం సీట్లు కాంగ్రెస్ ఇస్తుందని చెప్పటం. అదే అసలైన మోసం.