Assembly Elections | హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): ముందుగా టికెట్లు ప్రకటించే దమ్ము, ధైర్యం లేని కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ల జాబితా ప్రకటన కోసం గోతికాడి నక్కల్లా ఎదురుచూస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు 119 నియోజకవర్గాల్లో నిలబెట్టేందుకు సరైన అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్ఎస్ పక్కన పెట్టిన నేతలకు గాలం వేసేందుకు ప్లాన్ వేశాయి. బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో టికెట్లు దక్కని నేతలెవరైనా తమ పార్టీ వైపు చూడకపోతారా? అనే దింపుడుగళ్లం ఆశలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది తామే అంటూ ఢాంబికాలు పలికే జాతీయపార్టీలు దమ్మున్న లీడర్.. సరైన క్యాడర్ లేకపోవడంతో బీఆర్ఎస్ కన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించే ధైర్యం చేయలేకపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అసంతృప్తుల కోసం ఎదురుచూపులు!
జాతీయ పార్టీలని, దేశాన్ని ఏలామని చెప్పుకొనే కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రంలో ఎన్నికల్లో నిలిపేందుకు అభ్యర్థులు కరువయ్యారు. ఈ రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ అసంతృప్త నేతలపై ఆధారపడే దుస్థితికి చేరాయి. మిగిలిన రాష్ర్టాల్లో ఎన్నికల సమయంలో హడావిడిగా అభ్యర్థులను ప్రకటించే ఈ రెండు పార్టీలు తెలంగాణలో మాత్రం అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నాయి. రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యపోయేలా సీఎం కేసీఆర్ అన్ని పార్టీల కన్నా ముందు మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి సంచలనానికి తెరలేపగా, రెండు పార్టీలు.. బీఆర్ఎస్లో సీటు దక్కని నేతలను తమవైపునకు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తమతో బీఆర్ఎస్ నేతలు టచ్లో ఉన్నారంటూ చాలాసార్లు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలనుబట్టి ఆ రెండు పార్టీలు బీఆర్ఎస్ నేతలపైనే ఆధారపడ్డాయనేది స్పష్టమవుతున్నది. సీఎం కేసీఆర్ పక్కనపెట్టిన నేతలే కాంగ్రెస్, బీజేపీకి మహాప్రసాదంగా మారారని సోషల్మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. బీఆర్ఎస్లో టికెట్ దక్కకపోయినప్పటికీ సీఎం కేసీఆర్ను నమ్ముకున్న నేతలెవరూ పార్టీని వీడి వెళ్లబోరని, భవిష్యత్తులో పార్టీలో వారికి సముచిత స్థానం దక్కడం పక్కా అని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీల దింపుడుగల్లం ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.