మహబూబ్ నగర్, జూలై 28 : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మాయమాటలు చెప్పేందుకు, ప్రజలను మభ్య పెట్టేందుకు కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని..వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వెంకటేష్ , ఆంజనేయులు, రాములు, కృష్ణయ్య సహా సుమారు 30 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ధర్మాపూర్ తిరుపతయ్య ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో అధికార పార్టీలో చేరారు.
వారికి గులాబీ కండుకాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణను అన్ని విధాలుగా అణచివేసిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ప్రజలకు మాయమాటలు చెప్పేందుకు వస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందన్నారు.
గతంలో రూ. 200 ఆసరా పింఛన్లు ఇచ్చి వృద్ధులు, దివ్యాంగులను ఏమాత్రం పట్టించుకోని పార్టీలు కూడా.. ఇప్పుడు సంక్షేమం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉందన్నారు. సంక్షేమ పథకాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్ పాల్గొన్నారు.