హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సామాజిక న్యాయం సాధ్యమని ముదిరాజ్ సమాజం తేల్చిచెప్పింది. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ముదిరాజ్‌లను రెచ్చగొడుతున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చింది. బుధవారం తెలంగాణభవన్‌లో ముదిరాజ్ సంఘ ప్రతినిధులతో జరిగిన సమావేశం అనంతరం శాసనసమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీమంత్రి పీ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, మత్స్య పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ పిట్టల రవీందర్, టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, ప్రొఫెసర్ దినేశ్, బిత్తిరి సత్తి (రవికుమార్) తదితరులు మీడియాతో మాట్లాడారు.
చెరువులు, రిజర్వాయర్లలో ప్రభుత్వమే చేపలు వేసి ఆ సంపదను ఉచితంగా ముదిరాజ్, గంగపుత్రులకు కేటాయించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని బండా ప్రకాశ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ముదిరాజ్ భవనానికి వందల కోట్ల విలువ చేసే ఐదెకరాల భూమితోపాటు రూ. 10 కోట్లు కేటాయించి వారి ఆత్మగౌరవం పెంచిన నేత సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ అవసరాలు, ఆధిపత్యం కోసం ముదిరాజ్‌లను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా, సామాజికంగా ముదిరాజ్‌లను అణచివేసిన కాంగ్రెస్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎమ్మెల్యే సీటు ముఖ్యమా? ముదిరాజ్ జాతి అభ్యున్నతి ముఖ్యమా?
ముదిరాజ్ సమాజాన్ని కాంగ్రెస్, బీజేపీ నిండా ముంచాయని మాజీ మంత్రి పీ చంద్రశేఖర్ ఆరోపించారు. ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ రెచ్చగొడుతున్నదని, ముదిరాజ్ బిడ్డలెవరూ ఆ ట్రాప్‌లో పడొద్దని సూచించారు. ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వనంత మాత్రాన ముదిరాజ్‌లను కేసీఆర్ దూరంపెట్టినట్టు కాదని పేర్కొన్నారు. ముదిరాజ్‌ల అభ్యున్నతే మనకు ముఖ్యమని అన్నారు. అనివార్య కారణాల వల్ల సీటు ఇవ్వని బీఆర్ఎస్ వైపు ఉందామా? సీటు ఇచ్చి గుంజుకున్న కాంగ్రెస్ వైపు ఉందామా? అని ప్రశ్నించారు. కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. సీంఎ కేసీఆర్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమని స్పష్టం చేశారు. బీసీలు గౌరవంగా తలెత్తుకొని జీవించేలా సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ముదిరాజ్‌ల జీవితాలను బాగుచేసిన బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉందామని పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకున్న వారు రేపు అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని అమ్ముకోరని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి హిట్లర్ కన్నా దుర్మార్గుడని ముదిరాజ్ నేత నగేశ్ ఆరోపించారు. అన్ని వర్గాలను రెచ్చగొడుతూ సమాజంలో అశాంతికి కారణం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల మనోధైర్యాన్ని దెబ్బకొడుతున్న రేవంత్‌కు తమ దెబ్బేంటో చూపించాలన్నారు. ఉద్యోగులు, ముదిరాజ్‌లు కేసీఆర్‌కు దూరం అయ్యారని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నేత మామిండ్ల రాజేందర్ ఆగ్రహం పిలుపునిచ్చారు.