హైదరాబాద్, జనవరి 22 (నమస్తేతెలంగాణ): కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పెద్దలు కుమ్మక్కై సింగరేణి కుంభకోణాన్ని కనుమరుగు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. రాష్ట్ర మంత్రుల వాటాల పంపిణీలో తేడాలు రావడంతోనే కుంభకోణం బయటకు వచ్చిందని చెప్తున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి.. సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? మంత్రులను ఎందుకు వెనుకేసుకొస్తున్నారు? అని ప్రశ్నాస్త్రాలు సంధించారు.
అక్రమాలకు చిరునామా అని దేశవ్యాప్తంగా మచ్చ తెచ్చుకున్న కాంగ్రెస్.. తెలంగాణ భవిష్యత్తుకు ఆశాకిరణమైన సింగరేణిని కుంభకోణాలకు నిలయంగా మార్చిందని ధ్వజమెత్తారు. నైని కోల్ బ్లాక్ టెండర్ల పేరిట భారీ అవినీతిపర్వానికి తెరలేపిందని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆధారాలు చూపడంతో ఆ టెండర్లను రద్దుచేశారని తెలిపారు. కానీ మిగిలిన కోల్‌బ్లాక్ టెండర్ల మాటేమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి అంటే ఒక్క బొగ్గు బ్లాక్ కాదని, తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తు అని అభివర్ణించారు. ఘన చరిత్ర కలిగిన సంస్థను కాంగ్రెస్ సర్కారు నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. సింగరేణి కార్మికుల రెక్కల కష్టాన్ని దోచుకొనేందుకు కాంగ్రెస్ పెద్దలు కంకణం కట్టుకున్నారని విమర్శించారు.
సీఎం బావమరిది కోసమే సైట్ విజిట్ సిస్టం
సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది కోసమే సింగరేణి టెండర్ల ప్రక్రియలో సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని సర్కార్ తీసుకొచ్చిందని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సంస్థ సొమ్మును అప్పనంగా ఆయనకు అప్పజెప్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో మైనస్‌కే టెండర్లను అప్పజెప్పామని, కానీ రేవంత్ ప్రభుత్వం ఫ్లస్కు అప్పగిస్తున్నదని తెలిపారు. సింగరేణి టెండర్ల కుంభకోణాన్ని ఆధారాలతో బయటపెట్టిన హరీశ్‌రావుపై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధిస్తున్నదని దుయ్యబట్టారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నదని నిప్పులు చెరిగారు. నిజంగా కుంభకోణం జరుగకుంటే కాంగ్రెస్ నాయకులు ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సింగరేణి కుంభకోణాలపై తాము చేస్తున్న ఆరోపణలపై సుమోటోగా సీబీఐ కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరుపాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. నైని కోల్‌బ్లాక్, సింగరేణి టెండర్ల పేరిట కాంగ్రెస్ సర్కారు భారీ స్కాంకు తెరలేపితే, కేంద్ర మంత్రులైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ‘కేసీఆర్ పాలనలో తప్పులు జరిగితే కేంద్రంలో ఉన్న మీరు ఏం చేశారు’ అని నిలదీశారు.
సింగరేణిని కాపాడుకుంటాం
సింగరేణిని కేంద్రానికి అప్పగిస్తే బాగా నడిపిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని ఈశ్వర్ పేర్కొన్నారు. ఇక్కడి కార్మికుల పొట్టలుగొట్టేందుకే అర్థరహిత ప్రతిపాదనలు ముందుకు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కార్మికులు బతుకవద్దా? అని ప్రశ్నించారు. కోల్ స్కాంపై హరీశ్‌రావు చూపిన ఆధారాలు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌కు కనబడకపోవడం విడ్డూరమని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కబంధ హస్తాల నుంచి సింగరేణిని కాపాడుకొనేందుకు పోరాడుతామని స్పష్టంచేశారు.
సైట్ విజిట్ పేరిట సిండికేట్
టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి
కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాతే సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం పెరిగిందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట సిండికేట్ విధానం తెచ్చి అక్రమ పర్వానికి అంకుర్పారణ చేసిందని నిప్పులు చెరిగారు. మెస్సీతో సీఎం ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సింగరేణి నిధులు వెచ్చించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. డిస్కమ్‌ల నుంచి రా వాల్సిన రూ.55 కోట్లను ఇవ్వకపోవడంతో సంస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గాలను అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.‘ సేవ్ సింగరేణి’ పేరిట ఉద్యమాన్ని నిర్మించి సంస్థను కాపాడుకుంటామని తేల్చిచెప్పారు.