హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణుల తీర్పు అక్రమాల కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో పదుల సంఖ్యలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం చూస్తే హస్తంపార్టీపై ఉన్న ప్రజావ్యతిరేకతకు అద్దంపడుతున్నదని వ్యాఖ్యానించారు. పోలీసులను అడ్డంపెట్టుకొని అధికారపార్టీ బలప్రయోగం చేసినా, అరాచకాలు సృష్టించినా, హత్యారాజకీయాలకు దిగినా ప్రజలు మాత్రం గులాబీ పార్టీకే జైకొట్టారని పేర్కొన్నారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని పల్లెల్లో గెలిచిన సర్పంచులతో పాటు నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి తరలివచ్చిన పంచాయతీ ఎన్నికల విజేతలను శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కేటీఆర్ అభినందించారు. ‘అధికార పార్టీ దుర్మార్గాలను ఎదిరించి గెలిచిన విజేతలు మీరు..పోలీసు కుట్రలను ఛేదించిన యోధులు మీరు.. పోరాట పటిమ చూపిన ధీరులు మీరు’ అంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఆచరణలో విఫలమైందని దుయ్యబట్టారు. రెండేండ్లలో అన్నివర్గాలను నిండా ముంచిందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లోనే పల్లె ఓటర్లు అధికార పార్టీని తిరస్కరించారని, ప్రజాసమస్యలపై పోరాడుతున్న గులాబీ పార్టీ వెంటే నిలిచారని స్పష్టంచేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
సర్పంచులతో వరుస భేటీలు
రానున్న వారం, పది రోజుల పాటు బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారు. వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలుపనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.
సీఎం ఇలాకా.. బీఆర్ఎస్ తడాఖా.. కొత్త సర్పంచులతో కేటీఆర్

సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కాంగ్రెస్‌పై నిలిచి గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్‌లను హైదరాబాద్‌లోని నివాసంలో అభినందిస్తున్న కేటీఆర్
సర్పంచ్ ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డికి ఎదురుదెబ్బ అన్నెపర్తి సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుదారు గెలుపు
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. నల్లగొండ నియోజకవర్గంలోని అన్నెపర్తి గ్రామ సర్పంచ్ ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతుదారు మేకల పల్లవీ అరవింద్‌రెడ్డి గెలిచారు. ప్రలోభాలకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా ఏ మాత్రం జంకని మేకల పల్లవీ అరవింద్‌రెడ్డి విజయం సాధించారు. కాగా, అన్నెపర్తి సర్పంచ్ పల్లవీ అరవింద్‌రెడ్డి, వార్డు సభ్యులు శనివారం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించి సన్మానించారు.