Ration Cards | నర్సింహులపేట, జనవరి 19 : కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రేషన్‌కార్డుల జాబితా ప్రజలను గందరగోళంలో పడేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికం చేయడంతో కులగణనలో ప్రతిఒకరూ కొత్తరేషన్ కార్డు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు కోసం పేర్లను నమోదు చేయించుకున్నారు. సర్వేలో రాయించుకున్న వారి పేర్లు జాబితాలో రాకపోగా, అనర్హులకు పేర్లు ఉండడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడపల గ్రామంలో ఆదివారం గ్రామ కార్యదర్శి రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసాలో వచ్చిన పేర్లను చదివి వినిపించారు.
అనర్హుల పేర్లు జాబితాలో ఉండడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కులగణన సమయంలో హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వాళ్లు కూడా గ్రామానికి వచ్చి తమకు రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు కావాలని సర్వేలో నమోదు చేయించుకున్నారు. గ్రామం నుంచి 300 నుంచి 400 మంది రేషన్ కార్డుల కోసం సర్వేలో నమోదు చేసుకోగా, కేవలం 40 మంది పేర్లు మాత్రమే రావడమేంటని కార్యదర్శిని ప్రశ్నించారు. జాబితాలో అర్హుల పేర్లు లేకుండా, తాతాలికంగా నివాసముంటున్న వివిధ రాష్ర్టాలకు చెందిన వారి పేర్లు, అనర్హుల పేర్లు రావడంతో గొడవలు మొదలయ్యాయి. లిస్టులో పేర్లు లేని వారంతా గ్రామపంచాయతీ వద్దకు వెళ్లి తమ పేర్లు ఎలా తొలగించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పేర్లు అర్హుల జాబితాలో చేర్చకపోతే ఆందోళనకు దిగాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు.
లిస్టులో నా పేరు లేదు
కులగణన సమయంలో అధికారులు మా ఇంటికి వచ్చారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న. మా ఇంటికి రెండు ప్రజాపాలన స్టికర్లు పెట్టారు. తీరా ఇప్పుడు చూస్తే నాపేరు లిస్టులో లేదు. అధికారుల తప్పిదం వల్ల నాకు రేషన్ కార్డు లేకుండాపోయింది. మరోసారి రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోమంటున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి. తప్పులు చేసిన అధికారులపై చర్య తీసుకోవాలి.
– కమటం వెంకన్న, వంతడపల, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు
ఉద్యోగస్థుల పేర్లున్నాయి
మా గ్రామంలో రేషన్‌కార్డు కోసం 300 మంది అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో మాత్రం 40 పేర్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో కార్డు ఉన్నవారు, ఉద్యోగం ఉన్నవారి పేర్లు ఉన్నాయి. వ్యవసాయం ఉన్న వారి పేర్లు ఆత్మీయ భరోసాలో చేర్చారు. అర్హులైన వారికి రేషన్‌కార్డులు, ఆత్మీయ భరోసా అందించే విధంగా చూడాలి.
– వెలిశాల యాకయ్య, వంతడపల