హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యాలయం తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే కార్యాలయంలో గందరగోళం, పారదర్శకత లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించాల్సిన కమిషన్, కనీస సమన్వయాన్ని కోల్పోయి, తీవ్ర విమర్శలను మూటగట్టుకుంటున్నది. ముఖ్యంగా మీడియాకు, తద్వారా ప్రజలకు సమాచారం చేరవేయడంలో ఎస్ఈసీ అనుసరిస్తున్న విధానం అనేక సందేహాలకు తావిస్తున్నది. ఇటీవల ఎన్నికల గుర్తులకు సంబంధించి గత కమిషనర్ పేరుతో ఉన్న పాత ఉత్తర్వులనే మీడియాకు జారీచేసి అభాసుపాలైంది. కొత్త కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా పాత కమిషనర్ పేరుతోనే పత్రాలు పంపడం కమిషన్ కార్యాలయంలో సమన్వయ లోపాన్ని, అజాగ్రత్తను బట్టబయలు చేస్తున్నది. ఈ లోపాన్ని గుర్తించిన తర్వాత మీడియా గ్రూప్ నుంచి వాటిని హడావుడిగా తొలగించడం గమనార్హం. కీలకమైన ఎన్నికల సమయంలో ఇలాంటి అనాలోచిత చర్యలు కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియలో అత్యంత ముఖ్య సమాచారమైన నామినేషన్ల లెకల విషయంలోనూ ఎస్ఈసీ తీవ్ర తాత్సారం చేస్తున్నది.
ఎన్నికలకు సంబంధించి రోజువారీ పురోగతి, ఫిర్యాదుల పరిషారం, వ్యయ పర్యవేక్షణ వంటి కీలక వివరాలను బహిర్గతం చేయడంలో ఎస్ఈసీ తీవ్ర జాప్యం చేస్తున్నది. పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతుండగా పోలింగ్, పోలింగ్‌కు నడుమ వ్యవధి కేవలం రెండ్రోజులే ఉంటున్నది. తొలి దశ ఎన్నికల నిర్వహణ, సమస్యలపై సమీక్ష కూడా పూర్తి కాకుండానే తదుపరి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తున్నది. ఈ స్వల్ప విరామం కారణంగా ఒక ప్రాంతంలో జరిగిన లోపాలు, పట్టుబడిన అక్రమ నగదు వంటి వివరాలు ప్రజలకు తెలియడం లేదు. దీనివల్ల ఓటర్లు సరైన అవగాహనతో తదుపరి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోతున్నది. మీడియా ప్రతినిధులు లేవనెత్తుతున్న కీలక సందేహాలకు ఎస్ఈసీ కమిషనర్ నుంచి గానీ, కార్యదర్శి నుంచి గానీ స్పష్టమైన సమాధానాలు రావడం లేదు.
ఎన్నికల సమాచార సేకరణ కోసం ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్తే కార్యాలయ ప్రాంగణంలో పీఆర్వోను తొలుత సంప్రదించాలని కార్యదర్శి పేషీ సిబ్బంది చెప్తున్నారు. పీఆర్వోను అడిగితే ‘నాకు తెలియదు.. కనుక్కొని చెప్తాను’ అంటున్నారు. మళ్లీ అడిగితే ‘పై నుంచి మాకు సమాచారం లేదు’ అని బదులిస్తున్నారు. ఎస్ఈసీ కమిషనర్, కార్యదర్శి అసలు మీడియా ప్రతినిధులను దగ్గరకు కూడా రానివ్వడం లేదు. ఎన్నికల్లో అక్రమ డబ్బు వినియోగాన్ని అరికట్టేందుకు కృషి చేస్తున్నామని కమిషన్ పదే పదే చెప్తున్నా, క్షేత్రస్థాయిలో పట్టుకున్న నగదు వివరాల వెల్లడిలో గోప్యత పాటిస్తున్నది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎంత నగదు పట్టుకున్నారు? ఎన్ని కేసులు నమోదు చేశారు?
అనే కీలక వివరాలకు సంబంధించి కమిషన్ గాని, కమిషన్ కార్యదర్శి గాని స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తున్నది. పట్టుబడిన నగదు, మద్యం వివరాలను వెంటనే బహిర్గతం చేయకపోవడం మూలంగా ఎన్నికల పారదర్శకత ప్రశ్నార్థకంగా మారుతున్నది. సమాచారం పారదర్శకంగా చేరవేయకపోవడం, ఎప్పటికప్పుడు ప్రజలకు వివరాలు ఇవ్వకపోవడంతో గ్రామీణ ప్రజలకు పంచాయతీ ఎన్నికలపై సరైన అవగాహన కలగడం లేదు. ప్రజలకు అందించాల్సిన సమాచారంపై మీడియా ప్రతినిధులకు కమిషనర్, కార్యదర్శి వివరణ ఇవ్వకపోవడం వల్ల సందేహాలు నివృత్తిగాక ప్రజల్లో అస్పష్టత నెలకొంటున్నది. ఎన్నికలంటేనే నమ్మకం, పారదర్శకతకు ప్రతీకగా ఉండాలి. కానీ ఇందుకు ఎస్ఈసీ పనితీరు విరుద్ధంగా ఉన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితులు ఎన్నికల ఫలితాలపైనే కాకుండా కమిషన్ విశ్వసనీయతపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని విశ్లేషకుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.