Battalion Constables | హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘రేయ్ బాబు..’, ‘ఏయ్.. టీజీఎస్పీ’,‘అరేయ్ బాబు.. వచ్చి గడ్డిపీకు’, ‘రేయ్ ఇసుక మొయ్యి’… ఈ సంభాషణలు, సంభోదనలు, మర్యాదలేని మాటలు అన్నీ ప్రతీ పోలీస్స్టేషన్లో మాకు నిత్యకృత్యమే.. కానిస్టేబుల్ ర్యాంకు అయినా.. ఏ పోలీస్స్టేషన్లోనూ మమ్మల్ని పేరుపెట్టి పిలువరని బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఏక్పోలీస్ విధానం కోసం ఆందోళన బాట పట్టిన బెటాలియన్ కానిస్టేబుళ్లపై సర్కారు చర్యలకు దిగింది. ఒకే రోజు వివిధ బెటాలియన్లలోని 39 మందిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో పేరు చెప్పడానికి ఇష్టపడని బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు ‘నమస్తే తెలంగాణ’తో తమ ఆవేదన చెప్పుకున్నారు. తెలంగాణ స్పెషల్ పోలీసు (టీజీఎస్పీ)లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి నిబంధనల్లో నెలకు 26 రోజుల పని ఒకటని చెప్పారు. ఈ విధానంతో ఎంతోమంది తెలంగాణ బిడ్డలు అష్టకష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎక్కడో ఆదిలాబాద్లో డ్యూటీ చేసే వాళ్లను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వేస్తే.. ప్రయాణానికే రెండురోజులు పోగా..మిగిలిన రెండురోజులు మాత్రమే కుటుంబంతో గడిపేవాళ్లమని చెప్పారు. ఈ నియంతృత్వ విధానాలకు స్వస్తి చెబుతూ.. స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 15 రోజులకు రెండ్రోజులు సెలవులు తీసుకునే వెసులుబాటు, ఏయే బెటాలియన్లలో ఉండే వారిని ఆయా బెటాలియన్ జిల్లా పరిధిలోని పోలీస్స్టేషన్లకే డ్యూటీలు విధించేలా అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కఠినతరమైన నిబంధనలకు పాతరేసి, అవసరమైతే మరో రెండ్రోజులు వెసులుబాటును బట్టి సెలవుతీసుకునేలా సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. కేసీఆర్ హయాంలో టీజీఎస్పీ పోలీసులు 15 రోజులుపాటు డ్యూటీలు చేసినా రెండుమూడ్రోజులు కుటుంబంతో హాయిగా గడిపేదని గుర్తు చేసుకున్నారు. బెటాలియన్ పోలీసుల విజ్ఞప్తి మేరకు ‘ఏక్ పోలీసు’ వ్యవస్థను తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులను వివిధ రాష్ర్టాల్లో అధ్యయనానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పంపారని గుర్తు చేశారు.
అదేసమయంలో ఎన్నికలు రావడంతో నాటి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తాము అధికారంలోకి వస్తే.. వెంటనే ‘ఏక్ పోలీసు’ను అమలు చేస్తామని పలుచోట్ల హామీలు ఇచ్చారని చెప్పారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడవకముందే.. ఏక్ పోలీసు విధానానికి స్వస్తి చెప్పి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నాటి 26 రోజుల పని, రాష్ట్రంలో ఎక్కడైనా 3 నెలలు పనిచేసే విధానాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. ‘తెలంగాణలో ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేస్తామని, మాతో ఓట్లు వేయించుకున్న రేవంత్రెడ్డి గారు.. ఇప్పుడు ఆ విధానంపై ఎందుకు మాట్లాడటం లేదు’ అని బెటాలియన్ కానిస్టేబుళ్లు, కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. 15రోజుల పనివిధానానికి పోలీసుశాఖ ఓకే చెప్పినా.. మాకు కావల్సింది మాత్రం ఏక్ పోలీస్ విధానమేనని వారు స్పష్టం చేశారు. తమకు ఏక్పోలీసు తీసుకొచ్చి, 3-5 ఏండ్లు ఒకచోట డ్యూటీ చేసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రాధేయపడుతున్నారు. ‘పాత రూల్స్ తెచ్చింది వాళ్లే.. దానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే.. మమ్మల్ని సస్పెండ్ చేసిందీ వాళ్లే’ అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.