ఆదిలాబాద్, మే 15(నమస్తే తెలంగాణ) : జొన్న రైతులు పంటను విక్రయించడానికి పడిగాపులు కాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 12 మార్కెట్లలో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా జొన్నలను మద్దతు ధర క్వింటాలుకు రూ.3371తో సేకరిస్తున్నది. 20 రోజుల కిందట జిల్లాలో జొన్నల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.2500తో కొనుగోలు చేస్తుండడంతో రైతులు మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో పంటను విక్రయిస్తున్నారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పంట కొనుగోళ్లలో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యహరిస్తున్నారని, ఫలితంగా తాము ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు తెలిపారు. పంట కొనుగోళ్లలో జాప్యం ఫలితంగా జొన్నలను దొంగలు ఎత్తుకుపోతున్నారు. యార్డులో భద్రత లేకపోవడంతో దొంగలు పేట్రేగిపోతున్నారు. పంట ఉత్పత్తులను ఎత్తుకెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై దాడులకు పాల్పడుతున్నారు.
ఆదిలాబాద్ మార్కెట్‌యార్డుకు తెచ్చాను. మూడ్రోజులు అవుతున్నా పంటను తీసుకోవడంలేదు. లారీలు వస్తలేవని, సంచులు ఖాళీ కావడం లేదని సిబ్బంది అంటున్నారు. షెడ్డులో బుధవారం రాత్రి పంటకు కాపలాగా నిద్రిస్తుండగా ముగ్గురు దొంగలు వచ్చారు. రెండు గోనె సంచుల్లో జొన్నలను
నింపుకుంటుండగా అడ్డుకోగా నాపై కట్టెలతో దాడి చేశారు. తలకు గాయాలై మూడు
కుట్లుపడ్డాయి.
– నారాయణ, రైతు, బరంపూర్, తలమడుగు, ఆదిలాబాద్.
ఆదిలాబాద్, మే 15(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులపై దొంగలు దాడిచేశారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. రైతులు పంటను తీసుకొచ్చి మూడ్రోజులుగా మార్కెట్లో కాపలాగా నిద్రిస్తున్నారు. బుధవారం రాత్రి సమీపకాలనీకి చెందిన కొందరు మార్కెట్ యార్డుకు వచ్చి జొన్నలను సంచుల్లో నింపుకుని దొంగలిస్తుండగా రైతులు వారిని పట్టుకునే ప్రయత్నంచేశారు. దీంతో వారు రైతులపై రాళ్లు, కట్టెలతో దాడిచేశారు.
ఈ దాడిలో సాత్నాల మండలం రాంపూర్‌కు చెందిన దిలీప్‌రెడ్డి, తలమడుగు మండలం బరంపూర్‌కు చెందిన నారాయణకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మార్కెట్ యార్డుకు చేరుకుని గాయపడిన రైతులను దవాఖానకు తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జొన్నల కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రాథమిక సహకార సంఘాల సిబ్బంది నిర్లక్ష్యం ఫలితంగా అమ్మకాల్లో తీవ్రజాప్యం జరుగుతున్నదని, ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 15 ఉమ్మడి మెదక్ జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం కురిసిన వర్షంతో ధాన్యం తడిసి రైతులకు నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆరబోసిన, బస్తాల్లో ఉంచిన ధాన్యం సైతం తడిసిపోయింది. బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గురువారం కొండాపూర్ మండలంలో పర్యటించి తడిసిన ధాన్యం, మొక్కజొన్నలను పరిశీలించారు. అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ చౌటకూరు మండలంలో తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు.
సంగారెడ్డి జిల్లాలో సరాసరి 2.9 సెం.మీటర్ల సాధారణ వర్షం పాతం నమోదైంది. సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. అల్మాయిపేటలో 20 నుంచి 30 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. నేరేడిగుంట కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యంతోపాటు మిల్లుకు తరలించే ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. చింతకుంట కొనుగోలు కేంద్రం వద్ద 20 క్వింటాళ్ల ధాన్యం తడిసిసోయింది. అందోలు పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద 30 క్వింటాళ్ల ధాన్యం తడిసింది.
చౌటకూరు మండలం కోర్పొల్ కొనుగోలు కేంద్రంలో 800 ధాన్యం బస్తాలు, చౌటకూరులో 1600, చక్రియాల్‌లో 400, గంగోజిపేట 250 బస్తాల ధాన్యం తడిసిపోయింది. తాడ్దాన్పల్లి, బద్రిగూడెం, ఉప్పరిగూడెంలో 200 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయినట్టు రైతులు తెలిపారు. పుల్కల్ మండలం పుల్కల్, గొంగ్లూరు గ్రామాల్లో 1200 క్వింటాళ్ల వరకు ధాన్యం తడిచిపోయింది. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట, కల్పగూరు గ్రామాల్లో వరి ధాన్యం తడిసిపోయింది.
కంది కొనుగోలు కేంద్రంలో మిల్లులకు తరలించాల్సిన ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. సదాశివపేట మండలం కొల్లూరులో 20 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. కొండాపూర్ మండలం సీహెచ్ కొనాపూర్‌లో మొక్కజొన్న పంట వర్షానికి తడిసిపోయింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్, ముట్రాజ్‌పల్లిలో వర్షానికి ధాన్యం తడిసిపోయి రైతులు ఇబ్బందిపడ్డారు. మెదక్ జిల్లా కొల్చారం, చిలిపిచెడ్, మెదక్, పాపన్నపేట మండలాల్లో అకాల వర్షం కురిసి ధాన్యం తడిసింది.
జడ్చర్ల, మే 15 : ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కారు. ధాన్యం అమ్ముకునేందుకు 15 రోజులుగా జాగరణ చేయాల్సి వస్తున్నదని ఆగ్రహం చెందిన రైతులు గురువారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల హైవే-167పై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి సకాలంలో ధాన్యం తీసుకురాగా చెత్త, తేమ పేరుతో కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.తడిచిన ధాన్యాన్ని నిత్యం ఆరబెట్టాల్సి వస్తుందన్నారు. మిల్లులకు తీసుకెళ్తే తరుగు పేరుతో దగా చేస్తున్నారని వాపోయారు. రాస్తారోకోతో వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో ఎస్సై జయప్రసాద్ వచ్చి రైతులతో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి కొనుగోలు చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
చిన్నశంకరంపేట,మే15: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో గురువారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. శాలిపేటకు చెందిన మాలే సత్యనారాయణ(40) ఏడాదిన్నర క్రితం వ్యవసాయంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల అప్పుచేశాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకపోవడం, అప్పులోళ్ల వేధింపులతో మనోవేదనకు గురైన సత్యనారాయణ గురువారం తన వ్యవసాయం భూమి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు చిన్నశంకరంపేట ఎస్సై నారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.