మోర్తాడ్/సిరికొండ/మెండోరా (ఏర్గట్ల)/ఎల్లారెడ్డి, జూన్ 16: యూరియా యాప్‌నకు వ్యతిరేకంగా రైతాంగంతోపాటు బీఆర్ఎస్ కూడా పోరుబాట పట్టింది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించింది. యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని, వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్‌లో రైతులు మంగళవారం మహా ధర్నా నిర్వహించారు. మోర్తాడ్ సొసైటీ పరిధిలోని ఆరు గ్రామాల రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. దాదాపు రెండున్నర గంటలపాటు రాస్తారోకో నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
యాప్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, యూరియా బుక్ కాకపోవడం ఒక సమస్య అయితే, బుక్ అయిన రైతులు ఇతర గ్రామాల నుంచి తీసుకుని రావాల్సిన పరిస్థితుల్లో అదనపు ఖర్చు, సమయం వృథా అవుతుందని వాపోయారు. యాప్ విధానం గురించి తెలియని వారు, అండ్రాయిడ్ ఫోన్ లేనివారు ఎలా బుక్ చేసుకోవాలని ప్రశ్నించారు. యూరియా అందుబాటులో ఉండేలా చూస్తామని అధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. యూరియా యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిరికొండలో బీఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ‘యూరియా యాప్ పోవాలి.. రేవంత్ గద్దె దిగాలి’ అంటూ నినదించారు. మరోవైపు, మెండోరా మండలం పోచంపాడ్ ఎక్స్ రోడ్ వద్ద రైతులు, బీఆర్ఎస్ నాయకులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు.
రైతుల మధ్య యాప్ చిచ్చు
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ రైతుల మధ్య చిచ్చు పెడుతున్నది. సర్కార్ చర్యల కారణంగా గ్రామాలు, సొసైటీల వారీగా అన్నదాతల మధ్య విభజన ఏర్పడుతున్నది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని మత్తమాల సొసైటీ వద్ద మంగళవారం రైతుల మధ్య వివాదం రాజుకున్నది. తమ సొసైటీకి వచ్చిన యూరియాను తమకే ఇవ్వాలని, మిగతా సొసైటీల పరిధిలోని రైతులకు ఇవ్వొద్దంటూ స్థానిక రైతులు పట్టుబట్టడంతో వాగ్వాదం చోటుచేసుకున్నది.
మత్తమాల సొసైటీకి 400 యూరియా బస్తాలు రాగా, ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాల రైతులు సోమవారం యాప్‌లో బుక్ చేసుకున్నారు. వారంతా మంగళవారం ఉదయం మత్తమాల సొసైటీ వద్దకు చేరుకున్నారు. తమ సొసైటీకి వచ్చిన యూరియాను ఇతర సొసైటీల పరిధిలోని రైతులకు ఎలా ఇస్తారని స్థానికులు ప్రశ్నించారు. యాప్‌లో బుక్ చేయడం తమకు రాదని, తమకు యూరియా ఇవ్వకపోతే పంటలు ఎలా పండించాలని అధికారులను నిలదీశారు. మత్తమాలతో పాటు మరికొన్ని గ్రామాల రైతులు యూరియా పంపిణీని అడ్డుకున్నారు. రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, పోలీసులు వచ్చి సముదాయించారు. అధికారుల హామీతో పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ జరిగింది.