వర్ధన్నపేట, అక్టోబర్ 2 : కాంగ్రెస్ పాలనలో తాగు నీటి కోసం( Drinking water) మహిళలు మైళ్ల దూరం ప్రయాణించి తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామంలోని పోచమ్మవాడకు చెందిన మహిళలు బుధవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన(,Women Concern) తెలిపారు.
మిషన్ భగీరథ(Mission Bhagiratha) పైపులైన్లకు మరమ్మతులు జరుగుతుండడంతో వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పర్వతరగిరి, వర్ధన్నపేట మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, బుధవారం బతుకమ్మ పండుగ ఉన్నప్పటికీ అరకొరగానే నీటి సరఫరా జరిగింది. దీంతో మహిళలు గ్రామపంచాయతీకి చేరుకొని ఆందోళనకు దిగారు. బోరుబావుల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వెంటనే అధికారులు కాలనీకి నీటి సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు.