ఆదిలాబాద్ : పాల బిల్లుల కోసం పాడి రైతులు(Dairy farmers) రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా ఆదిలాబాద్(Adilabad district) జిల్లా ఇచ్చోడలో పాడి రైతులు ఆందోళన చేపట్టారు. విజయ పాల డెయిరీకి(Vijaya dairy) పాలు పోస్తున్నా మూడు నెలల నుంచి డబ్బులు ఇవ్వడం లేదని పాలు రోడ్డుపై పారబోసి ధర్నా చేపట్టారు. పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కాగా, విజయ డెయిరీకి పాలు పోసే రైతులను ఆ సంస్థకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? రైతులను ప్రైవేటు డెయిరీలకు మళ్లించే కుట్ర జరుగుతున్నదా..? ఇందులో భాగంగానే పాల బిల్లులను చెల్లించడం లేదా..? విజయ డెయిరీలో, పాడి రైతుల్లో ఈ చర్చ జోరుగా జరుగుతున్నది. నిప్పులేనిదే పొగరాదన్నట్టుగా ఈ చర్చకు బలం చేకూర్చేలా ప్రభుత్వం, విజయ డెయిరీ వ్యవహారశైలి ఉన్నది. విజయ డెయిరీ కథను ముగించేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు, విజయ డెయిరీ అధికారులు తెరవెనుక భారీ ప్లాన్ వేసినట్టుగా సమాచారం.
విజయ డెయిరీ నుంచి పాడి రైతులకు బిల్లుల చెల్లింపును నిలిపివేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు మూడు నెలల నుంచి రైతులకు రూ.150 కోట్ల వరకు బిల్లులు బకాయి ఉన్నట్టుగా తెలిసింది. ఇలా బిల్లులు నిలిపివేస్తే రైతులు విసిగి వేసారి విజయ డెయిరీకి పాలు పోయడం మానేసి ప్రైవేటు డెయిరీకి వెళతారనే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం విజయ డెయిరీకి సుమారు 40 వేల మంది రైతులు ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు.