ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 7 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట పత్తి రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, జెండా పాట లేకుండా.. తేమ శాతం నిబంధనలు సడలించి పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, నాయకులు నున్నా నాగేశ్వరరావు, బొంతు రాంబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా పత్తి మద్దతు ధర క్వింటాకు రూ.7,521 చొప్పున లభించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.5 వేల నుంచి రూ.6,700కు మాత్రమే ధర పలుకుతుండటంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. కొనుగోళ్ల సమయంలో ధర నిర్ణయిస్తే.. కాంటాలు పెట్టేటప్పుడు కోత పెట్టి రైతులకు నష్టం కలిగించడంపై మార్కెట్ కార్యదర్శి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.