Telangana | వరంగల్, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/పెద్దపల్లి, (నమస్తే తెలంగాణ): గోదావరి… తెలంగాణకు జీవనది. తాగునీటికి, పంటలకు, కరెంటు తయారీకి, పరిశ్రమలకు ఇదే జీవనాధారం. వానకాలంలోనే పుష్కలంగా పారే గోదావరిపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో జీవనదిగా మారగా… కాంగ్రెస్ సర్కారు కక్షపూరిత తీరుతో ఇప్పుడు జలంలేని ఎడారిగా మారిపోయింది. నాటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఎల్లంపల్లి నుంచి సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క బరాజ్ (దేవాదుల) వరకు దాదాపు 130 కిలో మీటర్ల మేరకు నది ఎండకాలంలోనూ గోదావరి నిండుగా కళకళలాడేది. గోదావరి నదిలోని నీటితో తెలంగాణలోని అత్యధిక ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేవి. యాసంగి పంటలకు పుష్కలంగా నీళ్లు పారేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటిపై అవగాహన లోపం, నిర్వహణ కారణంగా వానకాలం పంటలకూ భరోసా లేకుండా పోతున్నది. ముఖ్యంగా ఎల్లంపల్లి నుంచి అన్నారం వరకు 64 కిలో మీటర్ల మేర ఒక్క చుక్క నీరు కనిపించడం లేదు. అన్నారం దిగువన మేడిగడ్డ వరకు 16 కిలో మీటర్ల వరకు ఇదే పరిస్థితి దాపురించింది. అలాగే మేడిగడ్డ నుంచి 50 కిలో మీటర్ల దిగువన గంగారం వద్ద దేవాదుల పంప్హౌస్ఉండగా, దాని నుంచి 5 కిలోమీటర్ల దిగువన సమక్క బరాజ్ ఇప్పుడు గోదావరి నదిలా కాకుండా ఇసుకతిన్నుగా కనిపిస్తున్నది.
సాగునీటి కోసం అష్టకష్టాలు..
గోదావరిలో నీళ్లు లేకపోవడంతో దీని సమీపంలోని వందల కిలోమీటర్ల ప్రాంతంలో భూగర్భ జలాలు సగటున 2 మీటర్ల లోతులోకి వెళ్లాయి. ఎండల తీవ్రత ఇలాగే ఉంటే మరో రెండు వారాల్లోనే బోర్లు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా గోదావరి నదితోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాల్లోని బోర్లు, బావులు, చెరువులు, మానేరు, చలివాగుల్లో నీళ్లు కనిపించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సాగునీటికి ఇంతటి దుర్భర పరిస్థితి ఎప్పుడూ రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు అందేది. ఈ ప్రాజెక్టులోని డీబీఎం 38 కాల్వ కింద ఆరువేల ఎకరాలు సాగయ్యేది. ఇప్పుడు ఇక్కడకు నీళ్లు అసలే రావడం లేదు. నీటి వనరులు లేకపోవడంతో రైతులు పంటలను రక్షించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
సాకులతో కాళేశ్వరంపై దెబ్బ..
మేడిగడ్డ బరాజ్‌లో 8 బ్లాకులు, 85 గేట్లు ఉన్నాయి. ఏడో బ్లాకులో ఒక్క 20వ పిల్లర్‌ను సాకుగా చూపి కాంగ్రెస్ ప్రభుత్వం బరాజ్‌ను పక్కన పెట్టింది. ఎన్డీఎస్ఏ రిపోర్టు రావడం లేదనే సాకుతో వాయిదా వేస్తూ వస్తుంది. అయితే మేడిగడ్డ బరాజ్‌లో 16.17 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నది. ఇక్కడ నీటిని నిల్వ చేయకపోవడంతో 3.800 టీఎంసీ నీరు కిందికి వృథాగా పోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా 60 టీఎంసీల నుంచి 65 టీఎంసీల నీటిని రైతులకు సాగునీరు అందించేది. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి అన్నారం పంప్‌హౌస్‌కు, అక్కడి నుంచి సుందిళ్లకు, అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటిని పంపింగ్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతాంగం కరువు కోరల్లో చిక్కుకుంటున్నది. అన్నారం బరాజ్‌కు అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశారు. తెలంగాణలోని రైతులు, వ్యవసాయరంగం బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) అనుమతి తీసుకుంటే అన్నారం బరాజ్ నుంచి నీటి పంపింగ్ జరిగేది. ఇలా చేయడం వల్ల కనీసం 3 టీఎంసీల నీటిని లిఫ్టు చేసుకునే వీలుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
ఎల్లంపల్లిలో 15 టీఎంసీల నీరు నిలువ
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి వద్ద గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 15 టీఎంసీల నీరు నిలువ ఉండటంతో ఎల్లంపల్లి ఎగువన 7-8 కిలో మీటర్ల వరకు నీరు నిలువ ఉన్నది. ఆ జలాలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, పెద్దపల్లి జిల్లాలోని పారిశ్రామిక అవసరాలైన ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టులకు అందిస్తున్నారు. ఎల్లంపల్లి దిగువన నీటి పాయలు పెద్దగా లేకపోవడంతో చిన్నపాటి నీటి పాయలే దర్శనమిస్తున్నాయి.
గతంలో సుందిళ్లలోని పార్వతీ బరాజ్ గేట్లు వేసి నీటిని నిలువ చేసి ఎత్తిపోతలు నిర్వహించడం వల్ల సుందిళ్ల బ్యాక్ వాటర్ ఏరియాలోని 32 కిలో మీటర్ల దూరం తీర గ్రామాలైన సిరిపురం, బెస్తపల్లి, జల్లారం, సింగిరెడ్డిపల్లి, సుందిళ్ల, ముస్త్యాల, జనగామ, గోదావరిఖని, మేడిపల్లి, లింగాపూర్, పెద్దంపేట, రాయదండి, గోలివాడ, అంతర్గాం వరకు గోదావరినది నిండుకుండలా ఉండేది. సుందిళ్ల దిగువన మహదేవపూర్ మండలం అన్నారం వద్ద అన్నారం, సరస్వతీ బరాజ్ నిర్మించడంతో అన్నారం బరాజ్ ఎగువన 34 కిలో మీటర్ల దూరం తీర గ్రామాలైన అన్నారం, ఆరెంద, వెంకటాపూర్, మల్లారం, భట్టుపల్లి, ఖాన్సాయిపేట, ఖానాపూర్, మంథని, ఉప్పట్ల, పోతారం, నాగారం, గుంజపడుగు, సిరిపురం వరకు బరాజ్ నీటితో నిండుకుండను తలపించేది. అదే విధంగా మేడిగడ్డ వద్ద లక్ష్మీ బరాజ్‌ను నిర్మించి అక్కడి గేట్లను మూయడం వల్ల ఎగువన 34 కిలో మీటర్ల దూరం తీర గ్రామాలైన సూరారం, బెగ్లూర్, ఎలికేశ్వరం, బొమ్మాపూర్, మహదేవపూర్, ఎడపల్లి, కుదురుపల్లి, బీరసాగర్, కన్నెపల్లి, కాళేశ్వరం, కుంట్లెం, పల్గుల, మద్దులపల్లి, నాగెపల్లి, సండ్రువల్లి, అన్నారం వరకు గోదావరినది జలకళను తలపించేది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో వంద కిలోమీటర్ల గోదావరి తీరం నీళ్లు లేక ఎడారిని తలపిస్తున్నది. మేడిగడ్డ ఎగువ గోదావరి నుంచి ఎల్లంపల్లి వరకు గల గోదావరి నదిలో నీటి నిల్వలు పూర్తిగా పోయి, చిన్నపాటి పాయలు దర్శనమిస్తున్నాయి.
పండుతదో ఎండుతదో
మానేరు వాగు దగ్గర నాకు ఉన్న నాలుగు ఎకరాల్లో వరి వేసిన. మానేరు మొత్తం ఎండింది. కెనాల్ నీరు అత్తలేవు. నాట్లప్పుడే నీళ్లు అందుతలేవు. ఎట్ట కొసెళ్తదో అనే భయంగా ఉంది. బావులు, బోర్లలో నీళ్లు లేవు. బావులు మళ్లీ డబ్బులు పెట్టి పూడిక తీత్తే ఏమైనా నీల్లత్తయో సూడాలె. మాకు మానేరు, చలివాగులో నీళ్లు ఉన్నన్నీ రోజులు రంది లేకుండా ఉన్నం. ఇప్పుడు చలివాగు, మానేరు ఎండింది. ఏం చేయాలో తోత్తలేదు. గతంలో ఎప్పుడూ ఇట్ల కాలే. ఇంకో నెలా రెండు నెలలు అయితే ఇంకా గోస ఎక్కువ అయితది.
– నేరెళ్ల సునీల్, రైతు, వెంకట్రావ్పల్లి, టేకుమట్ల మండలం, భూపాలపల్లి జిల్లా