హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పేస్కేల్ అమలుచేయాలన్న డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులు మంగళవారం నుంచి సమ్మె బాటపట్టారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, జనగామ కలెక్టరేట్ల ఎదుట దీక్షలు చేపట్టారు. చాక్‌డౌన్, పెన్‌డౌన్ చేయడంతో కేజీబీవీలు, యూఆర్హెచ్లు, భవిత సెంటర్లల్లో విద్యాబోధన ఆగిపోయింది. తమను క్రమబద్ధీకరించాలని కోరుతూ కొంత కాలంగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల ఇందిరాపార్క్‌లో ధర్నాకుదిగి, ప్రభుత్వానికి సమ్మె నోటీసును అందజేశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పంద న రాకపోవడంతో సమ్మెకు దిగారు. దీంతో సర్కారు దిగివచ్చింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షప్రధాన కా ర్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పుల్గం దా మోదర్‌రెడ్డి, ఉద్యోగుల సంఘం నేతలతో చర్చించారు.
తమ పరిధిలో ఉన్న సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని, మిగతావి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని హామీనిచ్చి.. సమ్మెను విరమించాలని కోరారు. ఎస్ఎస్ఏ ఉద్యోగ సంఘం నేతలు మాత్రం సమ్మె విరమిస్తున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదు.