హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రెగ్యులర్తోపాటు మినిమం టైంసేల్ అమలుచేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ల ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. సిద్దిపేటలోని నిరసన దీక్షలో పాల్గొన్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి మాట్లాడుతూ.. నిరుడు సెప్టెంబర్లో హనుమకొండలో సమ్మె చేస్తున్న సందర్భంగా టీపీసీసీ హోదాలో రేవంత్రెడ్డి తమ వద్దకు వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, బేసిక్ పే అమలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. నాడు ఇచ్చిన హామీని అమలుచేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకాలంలో అనేకసార్లు కలిసి న్యాయం చేయాలని వినతిపత్రాలు ఇచ్చినా స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికే 169 మంది ఉద్యోగులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.