హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : నర్సింగ్ విద్యలో అక్రమాల బాగోతం బట్టబయలైంది. నర్సింగ్ స్కూళ్ల నిర్వాకంపై ఇటీవల నర్సింగ్ కౌన్సిల్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లోని 23 నర్సింగ్ స్కూళ్లపై కౌన్సిల్‌కు ఫిర్యాదులు అందాయి. ఓ మంత్రి సన్నిహితుడు హయత్‌నగర్‌లో నిర్వహిస్తున్న నర్సింగ్ స్కూల్ బిల్డింగ్‌లో 8 స్కూళ్లు ఉండటం చర్చనీయాంశమైంది. సదరు వ్యక్తి నల్గొండలో కూడా ఒకే బిల్డింగ్‌లో నాలుగు స్కూళ్లు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లు నిర్వహించడం సంచలనంగా మారింది. డీఎంఈ ఆదేశాల మేరకు నర్సింగ్ కౌన్సిల్ పారదర్శకంగా దాడులు చేయాల్సి ఉండగా.. అధికారులు యాజమాన్యాలకు ముందే సమాచారం అందించి వెళ్లినట్టు తెలిసింది.
తనిఖీలకు వెళ్లిన అధికారుల ఫోన్ నంబర్లు, వారి లైవ్ లొకేషన్‌ను షేర్ చేసి వెళ్లడం అనుమానాలకు తావిస్తున్నది. నల్గొండలో తనిఖీల కవరేజీకి వెళ్లిన రిపోర్టర్లపై సైతం యాజమాన్యాలు దాడికి యత్నించినట్టు సమాచారం. ప్రైవేట్ మేనేజ్మెంట్లు ముందుగానే సమకూర్చిన వాహనంలో అధికారులు తనిఖీలకు వెళ్లడం హాట్‌టాపిక్‌గా మారింది. కొన్ని స్కూళ్లు చిరునామా సమాచారాన్ని అసంపూర్తిగా అందించినట్టు తెలిసింది. కొన్ని కాలేజీలు ఏరియా పేరు(ఎల్బీ నగర్) జిల్లా(రంగారెడ్డి)ను మాత్రమే చిరునామాగా చూపడంతో అసలు అవి ఎక్కడ ఉన్నాయో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. తనిఖీలు సైతం నామమాత్రంగా జరిగినట్టు డీఎంఈ దృష్టికి వెళ్లడంతో రీ ఇన్స్పెక్షన్కు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.