ములుగు, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : అనర్హులకు ఇండ్లు కేటాయిస్తున్నారంటూ ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామస్థులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ టీఎస్ దివాకరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యాదవసంఘం అధ్యక్షుడు కత్తుల రమేశ్ మాట్లాడు టతూ.. 5 నుంచి 10 ఎకరాల భూమి ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని, భూమిలేని పేదలకు మంజూరు చేయలేదని ఆరోపించారు.
ఇప్పటికే పునాది తీసి పిల్లర్స్ వేసిన ఇండ్లను బిల్లులు తీసుకునే ప్రయత్నం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఇండ్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ స్పందించి.. పూర్తి విచారణ చేసి నివేదిక సమర్పించాలని వెంకటాపూర్ ఎంపీడీవోను ఆదేశించినట్టు రమేశ్ తెలిపారు.
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): యూపీఎస్సీ ఆధ్వర్యం లో నిర్వహించిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) అసిస్టెంట్ కమాండెంట్ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులను శాంతిభద్రతల డీజీ మహేశ్ భగవత్ అభినందించారు. 2024 నోటిఫికేషన్ నాటి తుది ఫలితాలు జూన్ 13న విడుదలయ్యాయి.
మొత్తం 459 మంది అభ్యర్థులు ఎంపికవగా, మహేశ్ భగవత్ మార్గదర్శకత్వంలో ఇంటర్వ్యూకు సిద్ధమైన 66మంది ఎంపికయ్యారు. వారిలో శ్యామ్యాదవ్ 2వ, శ్రేయస్ 5వ, కుల్దీప్ బిష్ణోయ్ 13వ, అనికేత్ త్రిభువన్ 20వ, రియా 35వ, సిద్ధేశ్ యోలే 49వ ర్యాంకులు సాధించారని తెలిపారు.