హైదరాబాద్, ఏప్రిల్ 25, (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదును ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్‌కు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. సదరు ఫిర్యాదును అందుకున్నట్టుగా స్పీకర్ కార్యాలయం నుంచి ధ్రువీకరణ రశీదు కూడా తీసుకోవాలని తెలిపింది. బీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశాన్ని అసెంబ్లీ కార్యదర్శి తమకు కల్పించలేదంటూ పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, వారిపై అనర్హత వేయాలనే ఫిర్యాదులను స్పీకర్ కార్యాలయం స్వీకరించకపోవడం వల్లే పిటిషన్ దాఖలు చేసినట్టు కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హైకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ..
స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఈ నెల 3న, 9న వెళితే అనుమతి లభించలేదని తెలిపారు. స్పీకర్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. దీంతో ఈ నెల 10న రిజిస్టర్ పోస్టు, ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశామని, దానికి ధ్రువీకరణ కూ డా ఇవ్వలేదన్నారు. రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిన కవర్ తిరిగి వెనకి వచ్చేసిందని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ అనర్హత పిటిషన్లను స్వీకరించాలన్నారు. బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన కడియం, వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరారని, కడియం కుమార్తె కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ కూడా కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి కల్పించుకుంటూ.. ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని, పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపే ఏర్పాట్లు చేస్తామన్నారు. స్పందించిన హైకోర్టు.. స్పీకర్‌కు ఫిర్యాదు కాపీలు అందనప్పుడు కడియం, వెంకట్రావుపై అనర్హత వేటువేయాలని ఎలా ఉత్తర్వులు ఇవ్వగలమని పిటిషనర్‌ను ప్రశ్నించింది. పిటిషనర్ ఫిర్యాదును ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్‌కు పంపేలా ఉత్తర్వులు ఇస్తామని చెప్పింది.
ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడం పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకమంటూ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌ను జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదిస్తూ.. దానం సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని, ఆయనకు కాంగ్రెస్ బీ-ఫారం ఇచ్చిందని తెలిపారు. అఫిడవిట్‌ను కూడా ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అందుకు న్యాయమూర్తి సమ్మతించారు. అనంతరం పిటిషనర్ల తరఫు న్యాయవా ది సంతోష్‌కుమార్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలన్న ఫిర్యాదు కాపీలను ప్రభుత్వ న్యాయవాది మోహనారెడ్డికి అందజేశారు. వాటిని స్పీకర్ కార్యాలయానికి పంపినట్టుగా సోమవారం తమకు తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.