హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ భారీ కబ్జాకు పాల్పడ్డారని ప్రజావాణిలో బాధితులు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితులు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్..
జీహెచ్ఎంసీలోని కాప్రాలో 61.34 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకున్నారని, 706 కుటుంబాలను ఆయన ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 50 మంది వరకు ఇండ్లు కట్టుకుంటే, వాటినీ కూలగొట్టారని వాపోయారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు కలిసి సమస్యను చెప్పామని, ఇప్పుడు సీఎంగా ఆయనకు మొరపెట్టుకునేందుకు వచ్చామని తెలిపారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని పేర్కొన్నారు.
ఏమిటీ 61 ఎకరాల కథ?
జీహెచ్ఎంసీ కాప్రా మున్సిపల్ సరిల్లోని సర్వే నంబర్లు 639/1, 648/1, 644/1, 647/1, 648, 654లో శంషాబాద్ కిష్టయ్య అండ్ ఫ్యామిలీకి 61.34 ఎకరాల భూమి ఉన్నది. 1982లో ఆ భూమిని ప్లాట్లు చేయడంతో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, ఇతరులు 706 మంది కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారు. అయితే, నాడు పీసీసీ మెంబర్‌గా ఉన్న ప్రేమ్‌సాగర్.. ఈ మొత్తం భూమిని కబ్జా చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఆయనకు ఉన్న పలుకుబడి వల్ల ఏం చేయలేకపోయమని వాపోయారు. హైకోర్టు తీర్పును కూడా ఆయన పట్టించుకోవడం లేదని తెలిపారు. చివరకు ధైర్యం చేసి 50 మంది ఇండ్లు కట్టుకున్నా, వాటిని ప్రేమ్‌సాగర్ కూలగొట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాహుల్‌గాంధీ, సోనియాగాంధీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశామని, సీఎం రేవంత్‌రెడ్డి, మల్లికార్జునఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్లామని వెల్లడించారు.