సుబేదారి, జనవరి 19 : రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రివా? వీధి రౌడీవా? రాష్ట్రంలో ఒక్క గులాబీ దిమ్మె కూల్చివేసినా తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోట ఘటన స్ఫూర్తితో మహిమ గల రాళ్లతో కాంగ్రెస్ నాయకుల పుర్రెలు పగుల్తాయని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్ హెచ్చరించారు. ఖమ్మం సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గద్దెలు కూల్చివేయాలని పిలుపునివ్వడంపై మండిపడ్డారు.
సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ నేత నాగుర్ల వెంకటేశ్వర్రావు తదితరులతో కలిసి హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్‌కు వెళ్లి సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కమిషనరేట్ ఆవరణలో దాస్యం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను యావత్ తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.