హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరతపై ( Fuel Shortage ) జాతీయ మానవహక్కుల కమిషన్( NHRC ) లో కేసు నమోదైంది. ఈ మేరకు తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ( Kethireddy Jagadeeswara Reddy ) ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత, ప్రజల ఇబ్బందులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులతో రవాణా అంతరాయం, ప్రజల్లో భయాందోళనలు, అత్యవసర సేవలపై ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అనేవి విలాస వస్తువులు కాదని, ప్రజల దైనందిన జీవనం, జీవనోపాధి, వ్యవసాయం, వైద్య సేవలు, ఆహార సరఫరా వ్యవస్థలకు మూలాధారమని తెలిపారు. అంబులెన్సులు , అత్యవసర వైద్య సేవలకు,ప్రజా రవాణాకు,వ్యవసాయం , ఆహార సరఫరా వ్యవస్థలకు, గృహ వంట అవసరాలకు, ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు, జీవనోపాధికి , పరిశ్రమలు సేవా రంగానికి అత్యంత ప్రధానమని పేర్కొన్నారు.
తెలంగాణ, ఏపీ , తమిళనాడు ముఖ్యమంత్రులు ఇంధన కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. నిల్వల పారదర్శకత, జిల్లా వారీగా అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్, నిల్వల వివరాలను ప్రజలకు వెల్లడించాలని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు.
అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, సరఫరా మళ్లింపు, తప్పుడు కొరత ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి అంతరాయం లేకుండా సరఫరా జరిగేలా చూడాలని కోరారు.