హైదరాబాద్/రంగారెడ్డి, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. బీఆర్ఎస్ గురుకులాల బాట కార్యక్రమంలో ఆయన శేరిగూడ గురుకుల పాఠశాలలోకి అనుమతి లేకుండా వెళ్లారంటూ ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా సాంఘిక సంక్షేమ వసతిగృహంలోకి వెళ్లారంటూ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు. 447 సెక్షన్ కింద నమోదు చేసిన కేసును దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రవీణ్‌కుమార్ బృందం వసతి గృహాలకు వెళ్లిన సమయంలో అక్కడి విద్యార్థులు తమకు కనీస సౌకర్యాల్లేవని, కుల్లిపోయిన కూరగాయలు, నాణ్యతలేని భోజనం వడ్డిస్తున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రవీణ్‌కుమార్ భరోసా ఇచ్చారు. అయితే ఈ ఘటన ఉదయం 11 గంటలకు జరగ్గా, శేరిగూడ పాఠశాల ప్రిన్సిపాల్ ధనలక్ష్మి మాత్రం సాయంత్రం ఇబ్రహీంపట్నం స్టేషన్లో తమకు సమాచారం ఇవ్వకుండా క్యాంపస్‌లోకి వచ్చారంటూ ఫిర్యాదు చేశారు. ప్రవీణ్‌కుమార్ శేరిగూడ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్లినప్పుడు అక్కడ ప్రిన్సిపాల్ లేరని, సాయంత్రం వచ్చి ఫిర్యాదు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ప్రవీణ్కుమార్పైనే ప్రిన్సిపాల్ కేసు పెట్టడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ అధికార పార్టీకి తొత్తుగా మారి, వారి కన్నుసన్నలో ప్రవీణ్‌కుమార్‌పై ఫిర్యాదు చేశారని బీఆర్ఎస్వీ నాయకుడు రాజ్‌కుమార్ మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. గురుకులాలపై ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంతో రెచ్చగొడుతున్నారని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గురుకులాల్లోని పాత పరిచయస్తులతో కలిసి అధ్యాపకులను, విద్యార్థులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. గురుకుల బడిబాటలో భాగంగా పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన ఇబ్రహీంపట్నం శేరిగూడలోని బాలురు ఎస్సీ గురుకులాన్ని సందర్శించారని, అనుమతి లేకుండా గురుకులంలోకి ప్రవేశించి అధ్యాపకులను, విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేశారని తెలిపారు. ఈ మేరకు అక్కడి గురుకుల ప్రిన్సిపాల్ ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు.