వనపర్తి, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోస పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాలో ఎండిన వరి పంటలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఎండిన పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దగూడెం తండా శివారులో ఎండిన పంటలను పరిశీలించేందుకు వచ్చిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఓ రైతు కష్టాన్ని చూసి చలించిపోయారు. హైదరాబాద్‌లో ఆటోనడవక జీవ్లా నాయక్ సొంతూరైన తండాకు వచ్చి మూడెకరాల పొలంలో నాట్లు వేసుకుంటే.. నీళ్లులేక మొత్తం ఎండిపోయిందని రైతు భార్య శాంతమ్మ కన్నీరుమున్నీరైంది. నాలుగు బోర్లు పని చేయడం లేదని, దీంతో వరి ఎండిపోయిందని వాపోయింది. ఇలా తండాలో ఇప్పటి వరకు 20 మందికి చెందిన 40 ఎకరాల్లో వరి పంట పూర్తిగా ఎండిపోయిందని గిరిజన రైతులు నిరంజన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు.