నల్లగొండ ప్రతినిధి (నమస్తే తెలంగాణ)/హనుమకొండ/హుజూరాబాద్ రూరల్, నవంబర్ 1: మొంథా తుపాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయని, ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహశబరీశ్, సత్యశారదను, జనగామలో కలెక్టర్ షేక్‌రిజ్వాన్ భాషాను స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి పంట నష్టంపై వినతిపత్రాలను అందజేశారు.
ఈ సందర్బంగా ఎర్రబెల్లి .. మొంథా ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నదని నతెలిపారు. వరి, పత్తి, మక్కజొన్నతోపాటు చేతికొచ్చిన ఇతర పంటలు నీటి మునిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పారదర్శకంగా సర్వే చేయించి రైతులకు పరిహారం అందించేలా చూడాలని కలెక్టర్లను కోరారు. పంట నష్టం పెద్ద ఎత్తున జరిగినా సీఎం రేవంత్‌రెడ్డి హెలిక్యాప్టర్‌లో వచ్చి వెళ్లాడే తప్ప ఏ ఒక్క రైతును నేరుగా కలిసి భరోసా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, సతీశ్‌కుమార్ మాట్లాడుతూ.. భారీ వర్షాలకు నష్టపోయిన రైతన్నలకు సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇవ్వలేకపోయారని ఆయన ఈసంద ర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులపై సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వరికి ఎకరాకు రూ.25వేలు, పత్తికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్, జూపాక గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తుంటే, కన్నీళ్లు తుడువాల్సిన ప్రభుత్వం నామమాత్రంగా పరిహారం ప్రకటించడం చూస్తుంటే రైతులపై చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నదో అర్థమువుతున్నదని అన్నారు. వర్ష బీభత్సంతో రైతుల కండ్లల్లో కన్నీళ్లు తప్ప మిగిలిందేమీ లేవని, నేలరాలిన పంట చేలను చూసి విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన రైతులందరికీ నష్టపరిహారం అందించకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తానని హెచ్చరించారు.

నల్లగొండ జిల్లా మంత్రులకు కమీషన్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ధాన్యానికి దక్కాల్సిన మద్దతు ధరను పణంగా పెట్టి మిల్లర్ల, వ్యాపారుల వద్ద కోట్లాది రూపాయల కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు. మంత్రులు గాలి మోటర్లలో తిరిగేందుకు పోటీ పడుతూ గాలి మాటల మాట్లాడుతూ రైతులను గాలికి వదిలేసారని ధ్వజమెత్తారు. శనివారం నల్లగొండ శివారులోని ఆర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో కలియ తిరిగుతూ రైతులతో మాట్లాడుతూ.. అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెల, నెలన్నర రోజుల నుంచి రైతులు ధాన్యం తెచ్చి పడిగాపులు పడుతుంటే కొనుగోళ్లు నత్తనడక సాగుతున్నాయని విమర్శించారు.