హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారమిచ్చి ఆదుకోవాలని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులతో ఖమ్మంతోపాటు నల్లగొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతోనే కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు, మక్కలు తడిసిపోయాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఇలాంటి పరిస్థితులు ఎదురైన సందర్భాల్లో వెంటనే పరిహారమిచ్చి ఆదుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుత సర్కార్ పరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉం డాలని, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.