రాష్ట్ర విభజన నాటి నుంచీ జల వివాదాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ అనేక డిమాండ్లను ముందు పెడుతున్నది. అపెక్స్ కౌన్సిల్, రివర్ బోర్డు మీటింగుల్లో పదే పదే చర్చకు పెడుతున్నది. కేంద్ర అధికారులు చర్చోపచర్చలు జరిపారు. పలుమార్లు కేంద్రానికి నివేదించారు. కానీ ఎన్నడూ కేంద్ర జల్‌శక్తి శాఖ పరిష్కారం కోసం చొరవ చూపనేలేదు. స్పందించనూలేదు. ట్రిబ్యునల్ అవార్డుతో ముడిపెట్టి దాటవేసింది. కానీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కోరగానే కేంద్ర జల్‌శక్తి శాఖ రంగంలోకి దిగింది. ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమలసాగర్‌కు ఆటంకాలు లేకుండా చేసే బాధ్యతనూ తలకెత్తుతున్నది. ఏకంగా నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, ఏపీ ప్రతిపాదించిన ఎజెండాయే అందుకు నిదర్శనం. రేవంత్‌రెడ్డి సర్కార్ సైతం వంతపాడటం ఇక్కడ గమనార్హం.
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిందే తడవుగా కేంద్రం కమిటీ వేసింది. జలవివాదాల పరిష్కారం పేరిట కుయుక్తి పన్నింది. పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై (పీఎన్ఎల్పీ) తెలంగాణను ఒప్పించేందుకు కుట్రకు తెరలేపింది. ఇంత జరుగుతున్నా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ నోరుమెదపనేలేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై జలసౌధ నుంచే అసంతృప్తి మొదలైంది. కేంద్రం ఇటీవల ఏర్పాటుచేసిన ఆ నిపుణుల కమిటీ పీఎన్ఎల్పీ సయోధ్య కోసమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎజెండాలో చేర్చిన జలవివాదాలన్నీ కూడా ఇప్పటికే ఏండ్ల తరబడి కోర్టుల్లో నానుతున్నాయి. ట్రిబ్యునల్ అవార్డు వస్తే తప్ప ఆయా అంశాల్లో ఎలాంటి పరిష్కారం లభించని పరిస్థితి. ట్రిబ్యునల్స్, కోర్టులు తేల్చాల్సిన అంశాలపై అధికారుల కమిటీ ఏం చేస్తుంది? అన్న ప్రశ్న తలెత్తుతున్నది. కమిటీలో తెలంగాణ నుంచి అంతర్రాష్ట్ర విభాగం అధికారులనూ భాగస్వాములను చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
తెలంగాణ, ఏపీ జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ నేతృత్వంలో ఇటీవల కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రత్యేకంగా సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటుచేసింది. తెలంగాణ, ఏపీ నుంచి నలుగురు చొప్పున, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు , గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, సీడబ్ల్యూసీ సీఈ సభ్యులుగా 15 మందిని కమిటీలో నియమించింది. గత జూలై 16న చర్చించిన ఎజెండాలోని అంశాలపై చర్చించి 3 నెలల్లోగా సమగ్రమైన నివేదికను సమర్పించాలని కమిటీకి సూచించింది. సాంకేతిక నిపుణుల కమిటీ ఎజెండాలోని అంశాలన్నీ ట్రిబ్యునల్ అవార్డుతో ముడిపడినవే కావడం అనుమానాలకు తావిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం అనేక అంశాలను ఎజెండాలో ప్రస్తావించగా, ఏపీ మాత్రం కేవలం పోలవరం బనకచర్ల/నల్లమసాగర్ లింకు ప్రాజెక్టును మాత్రమే అంశంగా పెట్టడం గమనార్హం. తెలంగాణ లేవనెత్తిన అంశాలన్నీ దాదాపు కృష్ణా జలాలకు సంబంధించినవే. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల డీపీఆర్‌లకు అనుమతులు, నీటి వినియోగ పరిమాణాల నమోదుకు టెలిమెట్రీల ఏర్పాటు, ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ విస్తరణ, ఔట్‌బేసిన్‌కు జలాల మళ్లింపు అంశాలు ఉన్నాయి. అవన్నీ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చినప్పుడు పరిష్కారం లభించేవి. ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ పనులపై ఎన్జీటీ ఇప్పటికే స్టే ఇచ్చింది. ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తయితే తప్ప తెలంగాణ లేవనెత్తిన అంశాలకు పరిష్కారం లభించదు. ఇప్పటికే ట్రిబ్యునల్ వాదనలు తుదిదశకు చేరుకున్నాయి. అయినా వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయడం, రేవంత్ సర్కార్ సైతం ఉత్సాహం చూపడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.
కేంద్రం అత్యుత్సాహంతో కమిటీ ఏర్పాటు చేయడం పోలవరం.. నల్లమలసాగర్ కోసమేనని తెలిసిపోతున్నది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా, ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను మళ్లించేందుకు ఏపీ పోలవరం బనకచర్ల (నల్లమలసాగర్) లింక్ ప్రాజెక్టును ఏపీ చేపట్టింది. ప్రాజెక్టుకు సంబంధించి పీఎఫ్ఆర్ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. సదరు పీఎఫ్ఆర్పై కేంద్ర పర్యావరణ శాఖ, కృష్ణా, గోదావరి రివర్ బోర్డులు, ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ బాహాటంగానే అభ్యంతరాలు వ్యక్తంచేశాయి.
పొరుగు రాష్ర్టాల సమ్మతి తీసుకోవాల్సిందేనని, ఆ తర్వాతే అనుమతుల కోసం రావాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ) సైతం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే కేంద్రంపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఏపీ సైతం తమ రాష్ట్రం తరఫున ఎజెండాలో పీఎన్ లింకు ప్రాజెక్టు ఒక్కదానినే ప్రతిపాదించడం గమనార్హం. తెలంగాణ జలహక్కులకు గొడ్డలిపెట్టులా పరిణమించనున్న ఆ లింక్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా వ్యతిరేకించకుండా, కమిటీ ఏర్పాటుకు, చర్చలకు అత్యుత్సాహం చూపడం ఇక్కడ కొసమెరుపు.
రాష్ట్ర విభజన నాటి నుంచీ తలెత్తుతున్న జల వివాదాలపై ఇరు రాష్ర్టాలు పన్నేండేండ్లుగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి అనేక అంశాలపై పలుమార్లు విజ్ఞప్తులు చేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లోనూ, రివర్ బోర్డుల సమావేశాల్లోనూ ప్రస్తావించింది. 66:34 నిష్పత్తితో చేసుకున్న తాత్కాలిక ఒప్పందానికి ఎట్టి పరిస్థితిలో అంగీకరించబోమని, ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంతవరకూ 50:50 నిష్పత్తిలో వినియోగించుకుంటామని 2018 నుంచి డిమాండ్ చేస్తున్నది. భారీ మొత్తంలో నీటిని నిల్వ చేసుకునేందుకు ఆఫ్‌లైన్ రిజర్వాయర్లు తెలంగాణకు లేవని, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకుని, భవిష్యత్తు తాగు, సాగునీటి అవసరాల మేరకు వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని, తెలంగాణ కోటాలో ఆ నీటిని చేర్చవద్దని పట్టుబడుతున్నది.
శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీటికి, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటున్న నీటికి ప్రతిసారీ ఎంతో వ్యత్యాసం కనబడుతున్నదని, దానిపై బాథోమెటిక్ సర్వే చేయించాలని, పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీటికి, చెన్నైకి చేరుకుంటున్న నీటిపైనా అదే తరహాలో బాథోమెటిక్ సర్వే చేయించాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. గత పన్నెండేండ్లలో ఏనాడూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ పట్టించుకున్న పాపానపోలేదు. రివర్ బోర్డులు సైతం ఏపీకి వంతపాడేలా వ్యవహరిస్తూ వచ్చాయి. ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు, అదీ ట్రిబ్యునల్ వాదనలు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో, ఏపీ లేవనెత్తిన పీఎన్లింకు ప్రాజెక్టు ఎజెండాను ఆధారంగా చేసుకొని కేంద్రం చర్చలు జరిపేందుకు కమిటీని సైతం ఏర్పాటు చేయడం గమనార్హం.
కేంద్ర జల్‌శక్తి నియమించిన కమిటీలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులకు చోటు కల్పించకపోవడం ఇరిగేషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నదీ జలాల వివాదాలు, ట్రిబ్యునల్ అవార్డులు, నిబంధనలు, పొరుగు రాష్ర్టాలతో ఉన్న ఒప్పందాలు, ప్రాజెక్టులు తదితర కీలక అంశాలను అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. తాజాగా కేంద్రం ఏర్పాటుచేసిన 15 మంది కమిటీలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారుల్లో ఏ ఒక్కరికీ చోటు కల్పించకపోవడం గమనార్హం. మరోవైపు ఏపీ జలవనరుల విభాగం సీఈకి సదరు కమిటీలో కేంద్రం చేర్చింది.
తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారుల పేర్లను ప్రతిపాదించినా కేంద్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కేవలం ముగ్గురు ఐఏఎస్‌లను, ఈఎన్సీని మాత్రమే తెలంగాణ నుంచి కమిటీలో చేర్చింది. సదరు అధికారులందరికీ చివరగా మళ్లీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగమే సాంకేతిక సహకారం అందించాల్సి ఉన్నది. ఏపీ నుంచి సీఈని చేర్చి, తెలంగాణ నుంచి చేర్చకపోవడమే అనుమానాలకు బలం చేకూరుస్తున్నది.