హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ, ఏపీ మధ్య జలవివాదాల పరిష్కారానికి 12 మంది అధికారులతో కమిటీ వేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఇటీవల ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయిన సంగతి తెలిసిందే. సమస్యల పరిష్కారానికి వారంలోగా ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి, నెల రోజుల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని ఆ భేటీలో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 12 మందితో కమిటీ వేయాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. కేంద్రం నుంచి జల్‌శక్తి శాఖ సెక్రటరీ, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సీఈలు కమిటీకి నేతృత్వం వహించాలని, ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున అధికారులు కమిటీలో సభ్యులుగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిసింది.
రెండు రాష్ట్రాల ఇరిగేషన్ సెక్రటరీలు, ఈఎన్సీలు, సీఈ స్థాయి అధికారులు, ఇంటర్‌స్టేట్ వింగ్ అధికారులను కమిటీలోకి తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. కమిటీ ఏర్పాటుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జలసౌధలో శనివారం ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేసినట్టు తెలిసింది.రాష్ట్రంలో రెండు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి స్టేట్ లెవెల్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లా మైలార్‌దేవ్‌రాంపల్లి వద్ద కట్టవాగు మీద చిన్నపాటి చెరువును, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం చెరువులకు నీళ్లందించేందుకు వెంకటాయపాలెం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వపై హైడ్రాలజీ క్లియరెన్స్‌ను మంజూరు చేసింది.