రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిరోజూ కోట్లాది రూపాయలను అందించే ప్రధాన ఆదాయ వనరుల్లో అబ్కారీ శాఖ ముఖ్యమైనది. ఈ శాఖలో డబ్బుల గలగలపై కొన్ని కమీషన్రాయుళ్ల కండ్లు పడ్డాయి. కొత్త ప్రభుత్వంలో అక్రమార్జనపై దృష్టిపెట్టిన కొందరు ఆ శాఖలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి.. ‘పెండింగ్ బిల్లులకు పేమెంట్ చెయ్యాలా? అయితే మరి మాకేంటి?’ అంటూ డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ క్లియరెన్స్‌కు పేమెంట్ ఇవ్వాల్సిన దుస్థితి దాపురించింది.
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ పేమెంట్లు ఆపకుండా.. రెగ్యులర్‌గా డబ్బులు రావాలంటే ఆ సప్లయర్స్ కొత్తగా కమీషన్ ఇచ్చుకోవల్సి వస్తుంది. వాళ్ల పెండింగ్ అమౌంట్‌ను బట్టి కమీషన్ ధర ఫిక్స్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా అబ్కారీశాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులలో ‘కమీషన్’ అనే పదం వినిపిస్తుండటంతో సప్లయర్స్ కంగుతింటున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని మద్యం వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. పెండింగ్ బిల్లులు రావాలంటే ఎంతోకొంత ఇవ్వాల్సిన దుస్థితి దాపురించిందని వాపోతున్నారు. ఈ నయా దందా రికార్డుల ప్రకారం అంతా సక్రమంగానే జరిగినా.. బయట మాట్లాడుకునే కమీషన్‌పైనే ఆధారపడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మద్యం కృత్రిమ కొరత వ్యవహారం బ యటికి పొక్కడంతో.. ఈ కమీషన్ దందాకు తెరలేపారని వ్యాపారులు చెబుతున్నారు.
మద్యం సరఫరా చేసే సంస్థల నుంచి డబ్బులు చెల్లించి ప్రభుత్వం మద్యం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ డబ్బును చెల్లించేందుకు 45 రోజుల వరకు గడువు ఉంటుంది. కొత్త ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అమలుకు డబ్బులు అవసరం ఉండటంతో.. ఎక్సైజ్‌శాఖ నుంచి వచ్చే డబ్బులను ఆయా పథకాలకు మళ్లించింది. దీంతో మద్యం సప్లయర్స్‌కు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోయాయి. ప్రభుత్వం ఎలాగైనా డబ్బులు చెల్లిస్తుందనే నమ్మకంతోనే సప్లయర్స్ మద్యం సరఫరా చేస్తున్నారు. ఇప్పుడా బకాయిలు సుమారు రూ.6వేల కోట్ల వరకు ఉన్నట్టు తెలిసింది. ఈ బకాయిల క్లియరెన్స్‌పై కొందరు ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఏ సప్లయర్స్ అయితే తమతో సఖ్యతగా ఉండి, అడిగినంత కమీషన్ ఇస్తా రో.. వారికి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను చెల్లిస్తున్నట్లు మిగతా వ్యాపారులు వా పోతున్నారు. కమీషన్ ఇవ్వని వ్యాపారులకు చెల్లింపులు ఆపుతున్నారని వాపోతున్నారు.
ఎక్సైజ్‌శాఖకు మద్యం సరఫరా చేస్తున్న సప్లయర్స్ వారి పెండింగ్ బిల్లును బట్టి.. సుమారు 5 నుంచి 10శాతం వరకు కమీషన్ ఇవ్వాల్సి వస్తుందని అంటున్నారు. లేకపోతే.. ‘ప్రభుత్వం ఇంకా డబ్బులు విడుదల చేయలేదు. రాగానే మీకు చేస్తాం’ అంటూ కొందరిని పెండింగ్‌లోనే పెడుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులలోంచి ప్రభుత్వం ప్రతినెలా సప్లయర్స్‌కు రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు చెల్లిస్తున్నది. ఆయా సప్లయర్ పెండింగ్ బి ల్లును బట్టి కమీషన్ అంటే.. దీంట్లోనుంచే కో ట్లాది రూపాయలను తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఈ ఏడాది మే నాటికి రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి సుమారు రూ.3వేల కోట్ల వరకు పెండింగ్ బకాయిల చెల్లింపులకు నిధులు విడుదలైనట్టు సమాచారం. మే నాటికి సుమారు రూ.1500 కోట్లను ఆయా సప్లయర్స్‌కు చెల్లించినట్టు తెలిసింది. వీటిల్లో ఎంత కమీషన్ ప్రభుత్వ పెద్దలకు చేరిందో.. ఆ పెరుమాళ్లకే ఎరుక అంటున్నారు సప్లయర్స్.