మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన కేంద్రం వాణిజ్య సిలిండర్ ధర అమాంతం పెంచి చిరు వ్యాపారుల నడ్డి విరిచింది. ఒకేసారి రూ.993 పెంచడంతో సిలిండర్ రేటు రూ. 3,315కు చేరింది. ఈ ప్రభావం మొత్తం ఫుడ్ ఇండస్ట్రీనే కుదేలు చేస్తున్నది. లక్షలాది కార్మికుల ఉపాధిని ప్రశ్నార్థకంగా మార్చింది. కమర్షియల్ సిలిండర్ ధర అనూహ్యంగా పెరుగడంతో వ్యాపారం నడుపలేమని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు, వీధి వ్యాపారులు నెత్తీనోరు బాదుకుంటున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర(19 కేజీలు) భారీగా పెరిగింది. ఒకేసారి రూ.993 పెంచడంతో సిలిండర్ ధర రూ.3,315కి చేరింది. ఈ ప్రభావం మొత్తం ఫుడ్ ఇండస్ట్రీనే కుదేలు చేస్తున్నది. లక్షలాది కార్మికుల ఉపాధిని ప్రశ్నార్థకంగా మార్చింది. కమర్షియల్ సిలిండర్ ధర అనూహ్యంగా పెరుగడంతో వ్యాపారం నడుపలేమని హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు తమ బిజినెస్‌ను తగ్గించుకున్నారు. కొందరు తమ నష్టాన్ని తగ్గించుకోవడం కోసం ఆహార పదార్థాల ధరలు పెంచారు. మరికొందరు తమ ఉత్పత్తిని తగ్గించి కార్మికులను తొలగించారు. ఇంకొందరు మూడంతస్తుల వ్యాపారాన్ని రెండు అంతస్తులకు పరిమితం చేసుకున్నారు. ఈ రంగంపై ఆధారపడిన నిత్యావసర సరుకుల దుకాణాలు సైతం నష్టాలను చవిచూడాల్సి వస్తున్నది. పెరిగిన ధరలు పరిస్థితిని మరింత అధ్వానంగా మార్చాయని నిర్వాహకులు కేంద్రంపై కన్నెర్ర చేస్తున్నారు. ఇక గ్యాస్‌పై వంటలు చేయలేమని, కట్టెల పొయ్యే దిక్కని మండిపడుతున్నారు.
షట్‌డౌన్ దిశగా హోటళ్లు, హాస్టళ్లు
హైదరాబాద్‌లో ప్రధానంగా ఎస్ఆర్నగర్, అమీర్‌పేట, ఎల్లారెడ్డిగూడ, అశోక్‌నగర్, నారాయణగూడ, చార్మినార్, నాంపల్లి, దిల్సుఖ్నగర్, కోఠి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్న హోటళ్లు, హాస్టళ్లు, చిరుతిండి వ్యా పారాల నిర్వహణ అతలాకుతలంగా మారింది. గ్యాస్ ధరలు తగ్గించకపోతే తమ వ్యాపారాలు కొనసాగించడం కష్టమని నిర్వాహకులు వాపోతున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఇటీవల గ్యాస్ సరఫరా ఆలస్యమవడంతో ఒక్క సిలిండర్ బ్లాక్ మార్కెట్లో రూ.6 వేలు పలికింది. ఈ దెబ్బతో చాలా మంది ఫుడ్ ఇండస్ట్రీ నిర్వాహకులు తమ నష్టాన్ని వినియోగదారులపై మోపాల్సి వచ్చింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓ ఉడిపి హోటల్లో ప్లేటు ఇడ్లీ రూ.45 ఉండగా రూ.75 చేశారు. అబిడ్స్‌లోని ఓ బిర్యానీ సెంటర్లో సింగిల్ చికెన్ బిర్యానీ రూ.120 ఉండగా రూ.140 చేశారు. ఇలా అనేక హోటళ్లలో తమ మెనూలను మార్చారు. ఇతర రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లు, చిన్న భోజనశాలలు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కార్మికులు లబోదిబో..
ఖర్చులను నియంత్రించేందుకు కొందరు హోటల్ యజమానులు ఉద్యోగులను తగ్గించే దిశగా అడుగులు వేస్తుండగా, మరికొందరు వ్యాపార సమయాలను కుదిస్తున్నారు. దీని ప్రభావంతో ఉపాధి అవకాశాలు కూడా తగ్గే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ప్యారడైజ్ సిబ్బంది మాట్లాడుతూ.. ‘సగటున మా రెస్టారెంట్లో రోజుకు 150 నుంచి 180 వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తాం. కానీ ఇప్పుడు ధరల పెంపుతో నెలవారీ నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. లాభాల మార్జిన్‌పై తీవ్ర ఒత్తిడి పడుతుంది’ అని తెలిపారు. బంజారాహిల్స్‌కు చెందిన ఒక రెస్టారెంట్ నిర్వాహకుడు మధునాయుడు మాట్లాడుతూ.. ‘ఎన్నికల అనంతరం ధరల పెరుగుదల, సకాలంలో ఎల్పీజీలు అందని పరిస్థితులు రాబోతున్నాయని మేం ఊహించాం. వాటిపై ఆధారపడటం తగ్గించాం. కట్టెలు, విద్యుత్తు గ్రిల్స్, ఇండక్షన్ పరికరాల వినియోగానికి అలవాటుపడ్డాం’ అని తెలిపాడు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుడు మాట్లాడుతూ.. ‘గతంలో మేము మూడు, నాలుగు సిలిండర్లను బ్యాకప్‌గా ఉంచుకునేవాళ్లం. ఇప్పుడు అది సాధ్యం కాదు. మూడు అంతస్తుల్లో ఉన్న వ్యాపారాన్ని ఒక అంతస్తు తగ్గించి రెండు అంతస్తుల్లో కొనసాగిస్తున్నాం’ అని ఆవేదన వ్యక్తంచేశాడు. అబిడ్స్‌లోని ఓ నిర్వాహకుడు మాట్లాడుతూ.. నెమ్మదిగా వండే గ్రేవీలు, నూనెలో వేయించే స్నాక్స్ తగ్గిస్తూ, పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు, బ్రేక్పాస్తా వంటి ఓవెన్, గ్రిల్‌పై వండే వంటకాలను అధికంగా చేసున్నట్టు చెప్పాడు.
బ్లాక్ మార్కెట్ దందా..
కేంద్రం పెంచిన వాణిజ్య గ్యాస్ ధర రూ.3,315కు తమకు గ్యాస్ దొరకదని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓ భోజనశాల నిర్వాహకుడు తెలిపాడు. కట్టెల ధర కిలో రూ.6 నుంచి 15కు పెరిగింది. ఇటీవల గ్యాస్ సరఫరా ఆలస్యం కారణంగా వాణిజ్య ఎల్పీజీ ధరలు బ్లాక్ మార్కెట్లో ఇప్పటికే రూ.6వేలకు పెరిగింది. ఇక ఇప్పుడు గ్యాస్ ధర పెంపుతో బ్లాక్‌లో రూ.7వేలు-10వేలు పలుకుతున్నదని, అంత డబ్బు పెట్టి కొనుగోలు చేయలేమని వాపోయాడు. గ్యాస్ బ్లాక్దందాతో స్ట్రీట్‌ఫుడ్ సైతం చాలా వరకు కనుమరుగు అవుతుంది. నగరవాసులు అత్యధికంగా ఇష్టపడే పానీపురి, పావుబాజీ, కట్లెట్, జిలేబీ సెంటర్ల నిర్వాహకులు సైతం పెరిగిన గ్యాస్ ధరలతో వ్యాపారం నడపలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కట్టెల పొయ్యే దిక్కు

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.993 పెరుగడంతో విధిలేక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో కట్టెల పొయ్యిపైనే మిర్చీలు వేస్తున్న హోటల్ నిర్వాహకురాలు
కట్టెల పొయ్యి పెట్టాం
దేశం అభివృద్ధి పథంలో నడువడమంటే మళ్లీ కట్టెల పొయ్యి రోజులను తీసుకురావడమేనా? కేంద్రం రూ.993 ఒకేసారి పెంచి రూ.3,315 చేసింది. అది బ్లాక్ మార్కెట్లో రూ.10వేల వరకు చెప్తున్నారు. అందుకే మేం కట్టెల పొయ్యిని ఆశ్రయించాల్సి వచ్చింది. నోటిఫికేషన్లు లేకపోవడం, టిఫిన్, భోజన ఖర్చులు, హాస్టల్ ఫీజులు పెరుగడంతో చాలామంది విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. ఇది బాధాకరం.
-రాంరెడ్డి, హాస్టల్ నిర్వాహకుడు
ఇక కూలికి వెళ్లాల్సిందే
గ్యాస్ బుక్ చేసుకుంటే రాదు. పోనీ బ్లాక్‌లో కొందామంటే రూ. 6 వేలకు పైమాటే. అర్జెంటుగా కావాలని అడిగితే రూ. 7వేల నుంచి 10వేలు చెప్తున్నారు. రోడ్లపై మిర్చిబజ్జీలు వేసుకుని బతికే మాలాంటి వాళ్లం.. రాబోయే రోజులను ఎలా ఎదుర్కోవాలనే ఆలోచన నిద్ర పట్టకుండా చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో వ్యాపారం బంద్ పెట్టి ఊళ్లో కూలికి పోవడం తప్పదనిపిస్తున్నది.
-యాదగిరి, బజ్జీ బండి నిర్వాహకుడు
గ్యాస్ కొరతతో అరిగోస పడుతున్నాం
నేను చిన్నపాటి టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నా. కొంతకాలంగా గ్యాస్ దొరక్క, సమయానికి టిఫిన్ అందించలేక అరిగోస పడుతున్నాం. సిలిండర్ ధర భరించలేక రూ.2.600 చెల్లించి వంటచెరుకు(కట్టెలు)తెప్పించి హోటల్ నడిపిస్తున్నా. దీనికి కూడా ఫారెస్టు వాళ్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ ధర పెరుగడంతో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. గ్యాస్ సిలిండర్ కొనలేక హోటల్ మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది.
– కంటెం శ్రావణి, చల్వాయి, గోవిందరావుపేట మండలం, ములుగు జిల్లా
రోడ్డున పడే పరిస్థితి వచ్చింది
కమర్షియల్ గ్యాస్ రేటు ఆకాశాన్నంటుతున్నది. ఒకేసారి రూ.993 పెరుగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గ్యాస్ ధరలు పెరిగినా.. టీ రేట్లు పెంచలేకపోతున్నాం. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో చిరుహోటళ్ల కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. గ్యాస్ భారం మోపడంతో టీ స్టాళ్లు, హోటళ్లు మూసివేసే పరిస్థితి నెలకొన్నది. పెరిగిన గ్యాస్ ధరల భారాన్ని వినియోగదారులపై మోపలేం. హోటల్ ఎలా నడుపాలో తెలియడం లేదు. పెంచిన ధరలపై కేంద్రం పునరాలోచన చేయాలి.
-భాస్కర్, టీ స్టాల్ యజమాని,అయిజ, జోగుళాంబ గద్వాల
పెంచిన ధరలను తగ్గించాలి
జగిత్యాలలో సత్రం ఎదురుగా పిండి వంటలు చేస్తూ, కర్రీ పాయింట్ నడిపిస్తున్నా. గడిచిన రెండు నెలల నుంచి గ్యాస్ కొరతతో కర్రీ పాయింట్‌ను బంద్ చేసిన. ఆ కొద్దిరోజులకు మోటర్తో నడిచే కట్టెల పొయ్యి కొని దానిపై పిండివంటలు, కూరలు చేస్తున్నా. అది కూడా అంతంత మాత్రమే నడుస్తున్నది. ఇప్పుడు గ్యాస్ ధర ఏకంగా రూ.3వేలకు పైగా చేరింది. దీంతో దుకాణం మూసివేయడం తప్ప మరో మార్గం లేదు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి గ్యాస్ ధరలను తగ్గించాలి.
– ఎనగంటి రవి, అభిరుచి కర్రీ పాయింట్, జగిత్యాల
నిరుద్యోగులు ఇబ్బంది పడుతారు
గ్యాస్ ధరలు పెరిగాయి. నిత్యావసర సరుకుల ధరలు సైతం పెరిగాయి. టిఫిన్ సెంటర్లో ఇద్దరు వ్యక్తులకు ఉపాధి కల్పిస్తున్నాను. కానీ పెరిగిన ధరలతో టిఫిన్ సెంటర్ నడిపించడం కష్టంగా ఉన్నది. టిఫిన్స్ ధరలు పెం చితే ఇక్కడ ఉన్నవాళ్లు అత్యధికంగా నిరుద్యో గ విద్యార్థులే ఉంటారు. వారు అంత డబ్బు పెట్టి తినలేరు. పెంచకపోతే హోటల్ నడపలేం. ప్రభుత్వం గ్యాస్ ధరలను
అందుబాటులో ఉంచాలి.
-సంగమేశ్వర్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు
ఇక కట్టెల పొయ్యే దిక్కు
దినదినం పెరుగుతున్న గ్యాస్ ధరలు మాలాంటి చిరువ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. జయశంకర్ జిల్లా మహదేవపూర్ గ్రామ ప్రధాన రహదారి పకన ఓ చిన్న హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నా. హోటలే మాకు జీవనాధారం. ఇప్పటివరకు గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడ్డాం. దీనికి తోడు కేంద్రం కమర్షియల్ సిలిండర్ ధర రూ.993 పెంచడంతో హోటల్ నడుపడం కష్టంగా మారింది. ధరల పెంపుతో కట్టెల పొయ్యే దిక్కైంది.
-జేక కవిత, హోటల్ నిర్వాహకురాలు,మహదేవపూర్, జయశంకర్ జిల్లా
వ్యాపారుల జీవితాలతో చెలగాటం
ఫారం కోడిని కాల్చాలన్నా.. స్కిన్ తీయాలన్నా గ్యాస్ తప్పక అవసరం. అటు కేంద్రం, ఇటు గ్యాస్ ఏజెన్సీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర అమాంతం పెంచడమే కాకుండా గ్యాస్ కొరత సృష్టించి వ్యాపారుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫారం కోళ్లు అమ్ముకోలేకపోతున్నాం. రెండు నెలల కాలంలో ఒక్కసారి కూడా కమర్షియల్ బండలు రాకపోవడంతో ఆర్థికంగా బాగా నష్టపోతున్నాం. తక్షణమే గ్యాస్ భారం తగ్గించడంతోపాటు కొరత లేకుండా చూడాలి.
-పంగి సురేశ్, చికెన్ సెంటర్ నిర్వాహకుడు,సారపాక, భద్రాద్రి కొత్తగూడెం
మోసం చేస్తున్న ప్రభుత్వాలు
ప్రజల గురించి ఆలోచించని, చింతన లేని ప్రభుత్వాలతో ఏం ప్రయోజనం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సామాన్య ప్రజల సంక్షేమం కంటే అధికారం కోసమే వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాయి. గత ఐదు నెలల్లో ఇబ్బడిముబ్బడిగా గ్యాస్ ధరలు పెంచడమే ఇందుకు నిదర్శనం. ఎటు తిరిగి మధ్య తరగతి ప్రజలపైనే ఆర్థిక భారం పడుతుంది. ధరల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి.
– కొమ్ము శ్రీనివాస్, వ్యాపారి, గోదావరిఖని
హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్తున్నారు
గ్యాస్ వినియోగం తక్కువగా ఉండే వంటకాలను మాత్రమే వడ్డిస్తుండడంతో గత్యంతరం లేక చాలామంది హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. బ్లాక్‌లో ఒక్కో సిలిండర్ ధర రూ.6 వేలకు పైమాటే. ఇప్పుడు ధర పెరగడంతో రూ.7వేలు-10 వేల వరకు చెప్తున్నారు. సగం మందితో హాస్టళ్లను కొనసాగించడమంటే చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. సగానికి సగం ఖాళీ అవుతున్న పరిస్థితుల్లో హాస్టల్ రెంటు, కరెంట్ బిల్లులు, మంచినీటి ట్యాంకర్లు, ఇతర నిర్వహణ ఖర్చులు భారంగా మారుతున్నాయి. ఇక హాస్టళ్లను మూసివేయాల్సిందే.
-దేవులపల్లి రవి, హాస్టల్ నిర్వాహకుడు, ఎస్ఆర్ నగర్
ధరలు పెంచడం దారుణం
గ్యాస్ కొరత నేపథ్యంలో కొన్ని రోజులుగా 90 శాతం వంటలు కట్టెల పొయ్యిపైనే చేస్తున్నాం. ఎమర్జెన్సీ అవసరమైతేనే గ్యాస్ వాడుతున్నాం. నెలన్నర, రెండు నెలల ముందు రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేస్తే ఒకేసారి నాలుగు సిలిండర్లు ఇచ్చేవారు. గ్యాస్ కొరత ఉందని వారానికి ఒకటే ఇస్తామన్నారు. మొన్నటి దాకా గ్యాస్ దొరకనే లేదు. రూ.2వేలు ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు రూ.3వేలకు పైగా చేరింది. దీంతో వ్యాపారం చేయలేని పరిస్థితి నెలకొన్నది. ధరలు పెంచడం దారుణం.
-గణేశ్, బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు, మంచిర్యాల
హోటల్ మూసివేశాం
గ్యాస్ కొరత, పెరిగిన ధరలతో హోటల్ నడుపలేక మూసేశాం. వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా రూ.వెయ్యి పెరిగి రూ.3,300 అయ్యింది. కట్టెలపొయ్యి మీద వర్కర్లు పని చేయలేకపోతున్నారు. వంట చెరుకు కూడా రూ.వెయ్యికి పెరిగింది. మొన్నటివరకు ఆటో లోడు రూ.1,500 ఉండగా గ్యాస్ కొరతతో రూ.2,500కు పెంచారు. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు కొని హోటల్ నడుపటం సాధ్యం కాదు. ప్రభుత్వం వెంటనే గ్యాస్ ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలి.
-మేచినేని గిరిధర్, టీ స్టాల్ యజమాని,అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం
టీకొట్టు నడిపేదెలా?
గ్యాస్ సిలిండర్ ధర చూస్తే భయమేస్తున్నది. ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర ఒకేసారి రూ.993 పెంచి తమలాంటి వారిపై మోయలేని భారం మోపింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం ఉన్న ధరను పెట్టలేక ఇబ్బందిపడుతుంటే.. మళ్లీ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం మరింత కష్టాల్లోకి నెట్టింది. టీ దుకాణం నడిపేందుకు ప్రతినెలా రెండు సిలిండర్లు అవసరమవుతాయి.. పెరిగిన ధరతో ఇప్పుడు నెలకు రూ. 6,300 వరకు గ్యాస్ సిలిండర్లకు ఖర్చు పెడితే, ఇక టీ దుకాణం కిరాయి, కరెంటు, పాలు, ఇతరత్రా ఖర్చులు ఎలా భరించాలి?
-శ్రీను, టీషాప్ నిర్వాహకుడు, జడ్చర్ల, మహబూబ్‌నగర్
గ్యాస్ ధరలు తగ్గించాలి
అనేక మంది కార్మికులు ఫుడ్ ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒక్కో వాణిజ్య సిలిండర్‌పై ఒకేసారి రూ.993 పెంచడం దారుణం. ఫుడ్ ధరలు పెంచితే వినియోగదారులు హోటల్స్‌కు రావడం మానేస్తారు. పెంచకపోతే యజమానులు నష్టపోయే పరిస్థితి ఉన్నది. దీంతో హోటళ్లు మూతపడే ప్రమాదం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని గ్యాస్ ధరలను తగ్గించాలి.
-సత్తిరెడ్డి, పేద ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షుడు