హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రొఫెషనల్ కళాశాలలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో వాటి యాజమాన్యాలు ఆందోళన బాటపట్టాయి. ఈ నెల 15 నుంచి కళాశాలల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నెలాఖరులోగా ఫీజులు చెల్లించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) ప్రతినిధులు శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డిని కలిసి నోటీస్‌ను అందజేశాయి. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విసిగి వేసారిన కాలేజీల యాజమాన్యాలు కళాశాలల మూసివేతకే నిర్ణయించాయి. విద్యాసంస్థలన్నింటికీ మూకుమ్మడిగా తాళాలు వేయాలని ఫతి ప్రతినిధులు నిర్ణయించారు. ఈ నెల 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తామని, కాలేజీలను తెరవబోమని, తరగతులు చెప్పబోమని ప్రకటించారు.
సెప్టెంబర్ 30 లోపు బకాయిలను విడుదల చేయకపోతే, ఆందోళనను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం చెప్పులరిగేలా సర్కారు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతోనే ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1,500 పైచిలుకు ప్రైవేట్ ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ, నర్సింగ్ తదితర వృత్తివిద్యా కాలేజీలు మూతబడనున్నాయి. దీంతో దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులు నష్టపోనున్నారు. ఆయా కాలేజీలకు మొత్తంగా సుమారు రూ.10 వేల కోట్లకు ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర ఫీజుల బకాయిలు చేరాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విసిగి వేసారిన కాలేజీల యాజమాన్యాల వినతులు అరణ్యరోదనే అయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నిరకాల ఉన్నత విద్యా కాలేజీల యాజమాన్యాలు గురువారం రాత్రి సమావేశమయ్యారు. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ సమావేశంలోనే కాలేజీల నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయనందుకు నిరసనగా ఇంజినీర్స్ డేను బ్లాక్‌డేగా పాటించాలని నిర్ణయించారు.
కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలంకావడం, బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీల యాజమాన్యాలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. దీంట్లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ అసొసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి)గా ఏర్పాటయ్యాయి. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని అనేక విజ్ఞప్తులు చేశాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు సహా ప్రభుత్వ పెద్దలందరినీ ఫతి ప్రతినిధులు కలిశారు. కానీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది. రూపాయి కూడా విడుదల చేయలేదు. టోకెన్లు జారీ అయిన వాటికి కూడా నిధులను విడుదల చేయలేదు.
ప్రభుత్వంపై భారం పడకుండా ప్రత్యామ్నామ ప్రణాళికను ఫెడరేషన్ ఆఫ్ అసొసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) ప్రతినిధులు సర్కారు ముందుంచారు. రూ.లక్ష కోట్ల డిపాజిట్లతో ప్రత్యేకంగా ట్రస్ట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ముందు ప్రతిపాదించారు. ఈ లక్ష కోట్లల్లో సర్కారు వాటా పరిమితమేనని, సీఎస్సార్, కార్పస్ ఫండ్ వంటి ఇతర మార్గాల ద్వారానే ఈ నిధులను సేకరించవచ్చని సూచించారు. ఈ లక్ష కోట్ల డిపాజిట్లపై వచ్చే 7 శాతం వడ్డీ (సుమారు రూ.3 వేల కోట్లు)తో ఫీజు రీయింబర్స్ చేయవచ్చని సూచించారు. దీనిని కూడా సర్కారు పట్టించుకోలేదు.
ఫతి బాటలోనే తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం (టీపీడీపీఎంఏ) కూడా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నెల 16 నుంచి కాలేజీలను మూసివేస్తామని అసొసియేషన్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణరెడ్డి, యాద రామకృష్ణ ప్రకటించారు. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి వినతిపత్రం అందించేందుకు వచ్చిన ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) ప్రతినిధులు
దసరా పండుగను మా కుటుంబాలన్నీ సంతోషంగా జరుపుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. జీతాలకు ఇవ్వకపోతే సోమవారం నుంచి విధులకు హాజరుకాబోమని ఫ్యాకల్టీ అల్టిమేటం జారీచేశారు. మేం తప్పనిసరి పరిస్థితుల్లోనే కాలేజీల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాం. రూ.10 వేల కోట్ల బకాయిలను ఈ నెల 30లోపు విడుదల చేయాలి. అంతవరకు మా పోరాటం సాగుతుంది. ఇవ్వకపోతే ఆ తర్వాత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ముఖ్యమంత్రి వద్ద విద్యాశాఖ ఉన్నదని సంతోషపడ్డం. కానీ, ఈ శాఖకు ప్రాధాన్యమే లేకుండా పోయింది. 6 నెలల నుంచి సర్కారు చుట్టూ తిరుగుతున్నాం. ప్రత్యామ్నాయ ప్రణాళికను సర్కారు ముందుంచాం. అయినా పట్టించుకోవడమే లేదు.
– రమేశ్, ఫతి చైర్మన్
ప్రైవేట్ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బందికి 6 నెలల నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కాలేజీలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. అప్పులు చేసి కొందరికి జీతాలు చెల్లిస్తున్నాం. యాజమానులుగా మేం మధ్యాహ్నం పూట కాలేజీలకే వెళ్లలేకపోతున్నాం. సాయంత్రం, రాత్రిపూట వెళ్లి సంతకాలు పెట్టి వస్తున్నాం. బకాయిల విడుదల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నాలుగుసార్లు కలిశాం. ఇంజినీర్స్ డేను బ్లాక్ డేగా పాటించి, బంద్‌ను పాటించబోతున్నాం. ఆగస్టు 31 నాటికి రావాల్సిన పూర్తి బకాయిలను విడుదల చేయాలి. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తాం.
– కేవీ రవికుమార్