హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): అవసరమైన పత్తి, పచ్చిరొట్ట విత్తనాలను జిల్లాలకు సరఫరా చేశామని, వాటిని సక్రమంగా రైతులకు అందించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇక నుంచి ప్రతి రోజు జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విత్తనాల విక్రయ కేంద్రాలను పరిశీలించాలని, రైతులకు ఎకడా ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. పత్తి విత్తనాల కొరతపై అధికారులు, కంపెనీలతో గురువారం
సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎకడైనా రైతులు ఎకువ సంఖ్యలో వస్తే, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
మొత్తం 1.26 కోట్ల ప్యాకెట్లకుగానూ ప్రస్తుతం జిల్లాల వారీగా వివిధ కంపెనీలకు చెందిన 68,16,967 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మిగిలిన ప్యాకెట్లు కూడా జూన్ 5 కల్లా జిల్లాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని విత్తన కంపెనీలను ఆదేశించారు. ఆదిలాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో రైతులు ఒకే రకమైన విత్తనాలను కోరుకుంటున్నారని, మారెట్లో లభ్యమవుతున్న ప్రతి విత్తన హైబ్రిడ్ల దిగుబడి ఒకటేనన్న అంశంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అన్ని జిల్లాలలో అవసరం మేరకు పత్తి, పచ్చిరొట్ట విత్తనాలు ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందకుండా అవసరం మేరకు విత్తనాలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.