Cabinet Meeting | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదేనని రాష్ట్ర మంత్రిమండలి స్పష్టం చేసింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలను అనుసరించి కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయం తీసుకొన్నది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ఎన్నికల కమిషన్ అనుమతి కోరాలని, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీతో పాటు రాష్ట్రం కోసం పోరాడినవారిని వేడుకలకు ఆహ్వానించాలని నిర్ణయించింది. ఎన్నికల కమిషన్ అనుమతితో సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమైంది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను సమాచారశాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ధాన్యం కొనుగోలుపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించినట్టు పొంగులేటి వివరించారు. ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదేనని సీఎం ఆదేశించారని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామని వివరించారు.
సన్న వడ్లకే బోనస్
సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించేందుకు వీటికి మాత్రమే బోనస్ చెల్లించాలని మంత్రిమండలి నిర్ణయించినట్టు పొంగులేటి తెలిపారు. హాస్టళ్లు, మధ్యాహ్న భోజనానికి, రేషన్‌షాపుల్లో కిలో రూ.2 బియ్యం పథకానికి సన్నబియ్యం ఇస్తామని తమ ప్రభుత్వం ప్రకటించటంతో, సన్న వడ్లు పండించే రైతులకే క్వింటల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని స్పష్టం చేశారు. సన్న వడ్లకు సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయశాఖ ప్రకటిస్తుందని అన్నారు. ఎన్నికలకు ముందు అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా, ‘ప్రస్తుతం సన్న వడ్లకు బోనస్ ఇస్తాం, ఆ తర్వాత విడతల వారీగా మిగతావాటికి కూడా వర్తింపచేస్తాం’ అని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిని కఠినంగా శిక్షస్తామని హెచ్చరించారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు రశీదులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
అమ్మ ఆదర్శ కమిటీలకు పాఠశాలల నిర్వహణ బాధ్యత
విద్య పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని, ఆ దిశగా కార్యాచరణకు మంత్రిమండలి నిర్ణయించిందని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో ‘అమ్మ ఆదర్శ కమిటీలు’ ఏర్పాటుచేసి, వాటికి పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగిస్తామని వెల్లడించారు. అందుకుగాను రూ.120 కోట్లు అడ్వాన్స్‌గా ఈ కమిటీలకు ఇచ్చి అత్యాధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. దీనికోసం మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్టు తెలిపారు.
కాళేశ్వరానికి మరమ్మత్తులు
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదిక ఇచ్చిందని, దీనిపై కూడా మంత్రిమండలి చర్చించినట్టు పొంగులేటి తెలిపారు. ఎన్డీఎస్ఏ తన మధ్యంతర నివేదికలో ప్రధానంగా ప్రభుత్వానికి మూడు సూచనలు చేసిందని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బరాజ్‌లలో నిర్మాణ లోపాలు ఉన్నట్టు చెప్పిందని వెల్లడించారు. భవిష్యత్తులో మరింత నష్టం కలగకుండా, వీటికి ప్రమాదం వాటిల్లకుండా గేట్లు తెరిచే ఉంచాలని సూచించిందని వివరించారు. మరమ్మత్తులు చేసినా ప్రమాదం ఉండదన్న గ్యారెంటీ ఇవ్వలేమని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందని తెలిపారు. మరమ్మత్తులు చేసేపక్షంలో వాటిని కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారానే చేయాలని, దీనికి రెండు సంస్థల నుంచి సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించినట్టు మంత్రి తెలిపారు. బరాజ్‌లలో నీటిని నిలువ ఉంచకుండా ఎత్తిపోయాలని సూచించిందని వివరించారు. రాక్ ఫార్మేషన్ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని వెల్లడించారు. ఆవిర్భావ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తారా? అని మీడియా ప్రశ్నించగా, తమకు ఎలాంటి భేషజాలు లేవని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
ధాన్యం వేగంగా కొంటున్నాం
యాసంగిలో పండించిన వడ్లను వేగంగా కొంటున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ కొనుగోలు చేసిందని వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు రోజులలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలోనూ ఇంత త్వరితగతిన ధాన్యాన్ని సేకరించటం లేదని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతులు తెచ్చిన ధాన్యానికి తరుగు తీసినట్టు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదివరకే ప్రభుత్వం ప్రకటించినట్టు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుభరోసా.. ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో 90 శాతం ధాన్యం సేకరణ జరిగిందని వెల్లడించారు.
వడ్లు వేగంగా కొంటున్నం..
యాసంగి వడ్లను వేగంగా కొంటున్నం. ఇప్పటికే 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినం. మూడ్రోజుల్లో డబ్బులు చెల్లిస్తున్నం. ఇంత వేగంగా ఏ రాష్ట్రంలోనూ కొంటలేరు.
– మంత్రి పొంగులేటి
తడిసిన వడ్లనూ కొంటున్నం
మా సర్కార్ గత ప్రభుత్వం తరహా కాదు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నం. రైతులు తెచ్చిన ధాన్యానికి ఎక్కడైనా తరుగుతీసినట్టు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం.
– మీడియాతో మంత్రులు