హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తర తెలంగాణలో సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీల నుంచి 16.1 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 10.2 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా గడిగూడలో 10.4 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీలో 10.9 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
నవంబర్‌లో ఒకటి, రెండు రోజులు విపరీతమైన చలి ఉండే అవకాశమున్నదని హెచ్చరించింది. కనిష్ఠ ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కు పడిపోయే సూచనలున్నాయని తెలిపింది. మంగళవారం నుంచి సాధారణ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశమున్నదని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాది నుంచి వీచే గాలుల ప్రభావంతోనే తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువ ఉన్నదని వెల్లడించింది.