హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడి, 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశలో వాయుగుండం కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. అదే విధంగా మరో 22 .జిల్లాలలో 14 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు. రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో బుధవారం 7.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.