హైదరాబాద్,జనవరి 11 (నమస్తే తెలంగాణ): గత కొద్దిరోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చలిగాలులతోపాటు దట్టమైన పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో చలి తీవ్రత మరింత పెరిగిందని వెల్లడించింది. దీని ప్రభావంతో 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు పేర్కొన్నది.
సంక్రాంతి వరకు చలి తీవ్రత ఇలా నే ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే రెండు నుంచి మూడు వరకు తక్కువగా నమోదవుతాయని పేర్కొన్నది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో 7.0 డిగ్రీలుగా నమోదైనట్టు వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.0, సంగారెడ్డి జిల్లా కోహీర్లో 8.9, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. వనపర్తి, జోగులాంబ గద్వాల మినహా అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది.