న్యూఢిల్లీ: ఐటీ రంగంలో ఉద్యోగాల భద్రతపై అస్థిరత కొనసాగుతున్న వేళ కాగ్నిజెంట్ తన ఉద్యోగుల్లో 15 వేల మందిపై వేటు వేయడానికి సిద్ధమవుతున్నది! ఇందులోనూ ఎక్కువ మంది ఉద్యోగులు భారత్లో పనిచేసే వారే అయ్యుంటారని మనీ కంట్రోల్ వెబ్సైట్ పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో 12-15 వేల మంది ఉద్యోగులను తగ్గించుకొనే ఆలోచన చేస్తున్నట్టు కాగ్నిజెంట్ యజమాన్యం తెలిపింది.
గత నెల 29న నాస్డాక్లో నమోదైన కాగ్నిజెంట్, ప్రాజెక్ట్ లీప్ అనే కార్యక్రమం కింద 230-320 మిలియన్ల ధనాన్ని ఉద్యోగ విరమణ పరిహార ఖర్చుల కింద ఖర్చు చేయాలని అంచనా వేస్తున్నట్టు తెలిసింది. క్లయింట్లు కొత్తగా ఉద్యోగంలో చేరే వారి (ఫ్రెషర్లు) శిక్షణ కోసం నిధులు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని.. దీంతో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి ఆలోచిస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు.
సీనియర్ ఉద్యోగుల నెలవారీ జీతం, వారిని తొలగిస్తే ఇవ్వాల్సిన పరిహార ఖర్చులను బేరీజు వేసుకొని ఉద్యోగులను తొలగించాలని కాగ్నిజెంట్ ప్రణాళికలను వేస్తున్నది. కంపెనీ సీఈవో రవి కుమార్ మాట్లాడుతూ ‘విశాలమైన, పొట్టిదైన పిరమిడ్’ నిర్మాణం నమూనాను అనుసరించి ఉద్యోగులను తొలగిస్తామని చెప్పారు. ఈ నమూనా ఆటోమేషన్ ప్రభావాన్ని సూచిస్తుందన్నారు.