హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌పై ముషీరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును బుధవారం హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా బాణసంచా కాల్చడంతోపాటు ప్రజలకు అసౌకర్యం కలిగించారంటూ అప్పటి ఎస్సై ఆర్ ప్రేమ్‌కుమార్ ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసును కొట్టివేయాలని ముఠా గోపాల్, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపిస్తూ.. ఇది రాజకీయ ప్రేరేపిత కేసని పేరొన్నారు. పోలీసులు నమోదు చేసిన అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని, సాక్షులంతా పోలీసులేనని, స్వతంత్ర సాక్షులు లేరని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను పరిశీలిస్తే ముఠా గోపాల్, కేటీఆర్‌పై కేసును కొనసాగించేందుకు సరైన ఆధారాలు లేవని పేరొన్నారు. అభియోగాలను నిరూపించే ఆధారాలు లేనందున కేసును కొట్టేస్తున్నట్టు ప్రకటించారు.