పెద్దపల్లి, జూలై 4 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో అవినీతి అక్రమాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఎండగడుతుండటంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెల్ఫ్‌గోల్‌లో పడిపోయారు. తెలంగాణలోని పది జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు గనులు, ఓపెన్ కాస్టుల్లో రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు ఎక్కడికి వెళ్లిందంటూ ఆధారాలతో సహా బయట పెట్టడంతో ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కంగుతిని ఆత్మరక్షణలో పడింది. సింగరేణిలో స్కామ్‌పై విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేయడంపై స్పందించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ‘సింగరేణి విజిలెన్స్‌తో విచారణ చేయిస్తామని ప్రకటించడం’ నవ్వుల పాల్జేయడమే గాక రాజకీయ దుమారం రేపింది.
సంస్థ ఎవరి కనుసన్నల్లో నడుస్తున్నదో అందరికీ తెలుసని, సొంత ప్రభుత్వం, సొంత యాజమాన్యంపై, సొంత విజిలెన్స్‌తో విచారణ చేయిస్తాననడం అంటే దొంగను దొంగే.. విచారించుకోవడం వంటిదనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విజిలెన్స్ రిపోర్టులు ఎలా తయారవుతాయో, కేంద్ర, రాష్ట్ర మంత్రుల కనుసన్నల్లో ఎలా రూపొందుతాయో తెలుసని, ఇది ఒక ఫాల్స్ డ్రామా తప్ప మరోటి కాదనే వాదన బలంగా వినిపిస్తున్నది. సింగరేణిలో పనిచేసే విజిలెన్స్ శాఖ.. సొంత సంస్థ అవినీతిని ఎలా బయట పెడుతుందని? ఇలా డిప్యూటీ సీఎం ప్రకటించడం ఏమిటని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుండగా, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సైతం సింగరేణిలో జరుగుతున్న అకౌంటింగ్ ఫ్రాడ్ గురించి, నిల్వల మాయం గురించి పూర్తిస్థాయిలో తెలుసని, బొగ్గు అకౌంటింగ్, పన్నుల చెల్లింపులు కేంద్రం పరిధిలోకి వచ్చే అంశాలని, కానీ బాధ్యత తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ కాలక్షేపం చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రక్షకులు కాదు.. లూటీదారులు
సింగరేణి ప్రతిష్ఠ దెబ్బతింటున్నది. అవినీతిపై మాట్లాడేవారిని భయపెట్టాలని చూస్తున్నారు. సంస్థను లోపల నుంచి కోత కోస్తూ, నష్టాల్లోకి నెడుతూ ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తున్నది వీరే. సంస్థను ఉద్ధరించే సేవియర్స్ కాదు. సింగరేణిని పీకుతింటున్న దొంగలు. సింగరేణి ప్రతిష్టను దిగజార్చింది వీరి అక్రమ వ్యాపారాలే. నిజాయితీ ఉంటే సింగరేణి విజిలెన్స్‌తో విచారణ చేయించడం కాదు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ప్రతినిధులు, బొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన స్వతంత్ర సాంకేతిక అధికారులు, సీబీఐ, కాగ్, ఐసీఏఐ, ఎంసీఏ నిపుణలతో సిట్‌తో విచారణ జరిపించాలి. – మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు