Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ): కేటీఆర్, కేసీఆర్, హారీశ్‌రావు, బీఆర్ఎస్పై బట్టకాల్చి మీదేయడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి మరో నాటకానికి తెరతీశారు. ఇటీవల పలువురు మరణించడాన్ని మాజీ మంత్రి కేటీఆర్‌కు అంటగట్టే కుట్రకు తెరలేపారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. లాయర్ సంజీవరెడ్డి, రాజలింగమూర్తి, నిర్మాత కేదార్ మరణాలపై అనుమానం ఉన్నదని అన్నారు. వరుసగా సంభవిస్తున్న మరణాలు అనుమానం కలిగిస్తున్నాయని చెప్పారు. దీన్ని కేటీఆర్‌కు ఆపాదించేలా ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎవరో మరణిస్తే.. కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించడం అనుమానాలకు తావిస్తున్నది. వాస్తవానికి లాయర్ సంజీవరెడ్డి ఆరు నెలల క్రితం మరణించారు. ఆయన గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు, పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత భూపాలపల్లిలో రాజలింగమూర్తి అనే సామాజికి కార్యకర్త హత్యకు గురయ్యారు. ఆయన భూతగాదాల కారణంగా హత్యకు గురయ్యారని ఆ జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే వెల్లడించారు.
ఇక మంగళవారం దుబాయ్‌లో సినీ నిర్మాత కేదార్ మరణించారు. పెళ్లి వేడుక కోసం దుబాయ్ వెళ్లిన ఆయన రాత్రి పూట నిద్రలోనే గుండెపోటుతో మరణించారు. ఈ విధంగా ఇద్దరు గుండెపోటుతో మరణిస్తే.. మరొకరు భూతగాదాల కారణంగా హత్యకు గురయ్యారు. వారి మరణానికి పోలీసులు ఒక కారణం చెప్తుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆరోపణలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం పదవిలో ఉంటూ సొంత పోలీసులు చెప్పిన మాటల్ని వక్రీకరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సీఎం రేవంత్‌రెడ్డికి అనుమానం ఉంటే.. సీఎం పదవిలో ఆయనే ఉన్నారు కాబట్టి విచారణకు ఆదేశించొచ్చు కదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విచారణకు ఆదేశించకుండా.. పోలీసులు చెప్పింది నమ్మకుండా.. కేవలం కేటీఆర్‌ను బద్నాం చేసేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.